పోలేపల్లికి రేణుకా ఎల్లమ్మకు సీఎం మొక్కు..!
– పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి
– మంత్రులతో కలిసి అమ్మవారికి పూజలు
– స్వాగతం పలికిన అధికారులు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లిలో వెలసిన రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొక్కు తీర్చుకున్నారు. శుక్రవారం జాతర ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పోలేపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ కు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణా రావు, శాసన సభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, రామ్మోహన్ రెడ్డిలతో కలిసి జాతర ఉత్సవాలలో పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి దేవాదాయ కమీషనర్ శ్రీధర్ పుష్ప గుచ్చం అందజేసి వేదంపండితులచే పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రాక పోలేపల్లిలో సందడి ఏర్పడింది.

అంతకుముందు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఇన్స్ పెక్టర్ ఆఫ్ జనరల్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. వారితో పాటు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ లతో పాటు దౌల్తాబాద్, దుద్యాల్ తాసిల్దార్లు గాయత్రి, కిషన్ లు ఉన్నారు. సీఎం రాక సందర్భంగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ అడిషనల్ ఎస్పీ వాసు దేవరెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదికూడా చదవండి…

