బల్దియాకు విజిలెన్స్ దడ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

బల్దియాకు విజిలెన్స్ దడ..!
– భవన నిర్మాణ పనులపై విచారణ
– నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదుతో సర్వే
– ఇంచు.. ఇంచు కొలతలు తీసుకున్న అధికారులు
– ప్రభుత్వానికి నివేధిక అందిస్తామన్న విచారణ బృందం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని మున్సిపల్ కార్యాలయంకు రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు అధికారులను దడ పుట్టించేంత పని చేసింది. శుక్రవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి డీఈతో పాటు ఇద్దరు ఏఈల అధికారుల బృందం విచారణ చేపట్టేందుకు వచ్చింది. కొత్త మున్సిపల్ భవనంలో చేపట్టిన నిర్మాణ పనులపై సమగ్ర సర్వే చేపట్టారు. అసలు ఈ సర్వే చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వివరాల్లోకి వెళితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో 2016లో తాండూరు పట్టణం లారీ పార్కింగ్ సమీపంలో మున్సిపల్ కు కొత్త కార్యాలయాన్ని మంజూరు చేశారు.

సరిగ్గా 9 ఏండ్ల కింద రూ.3కోట్ల 47 లక్షలతో కొత్త భవనం నిర్మించారు. పలు కారణాల వల్ల అందుబాటులోకి రాలేకపోయింది. అక్టోబర్ 2021లో కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకవచ్చారు. అదే ఏడాది దాదాపు రూ. 76లక్షల అదనపు నిధులతో పలు నిర్మాణాలను చేపట్టారని, ఇందులో నిధుల దుర్వినియోగం జరిగిందని రాష్ట్ర విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన ఇన్నేళ్ల తరువాత ఈ మేరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసింది.

డీఈ, ఇద్దరు ఏఈలతో పాటు సిబ్బందితో కార్యాలయం ముందు, వెనుక భాగాలలో సరిహద్దులను గుర్తించారు. దీంతో పాటు కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాల గదుల కొలతలను తీసుకున్నారు. పొడవు, వెడల్పులతో పాటు ఇంచు.. ఇంచు.. లెక్కలు వేసి వివరాలు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను కూడా నమోదు చేసుకున్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించలేదు. 2021లో ఎవరు ఫిర్యాదు చేశారనే వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నివేధికను ప్రభుత్వానికి అందిస్తామని బృందం అధికారి వెల్లడించారు. మరోవైపు కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల బృందం రాకతో ఇంజనీరింగ్ శాఖ అధికారుల్లో దడ కనిపించింది.

ఇదికూడా చదవండి…

పోలేపల్లికి రేణుకా ఎల్లమ్మకు సీఎం మొక్కు..!