ట్రైన్లో మీ ఫోన్ మిస్సైతే..!
– ఈజీగా కనిపెట్టి ఇప్పిస్తారు
– రైల్వే శాఖలో కొత్త వ్యవస్థ
– ఎలా పనిచేస్తుందో తెలుసా..?
దర్శిని డెస్క్ : ట్రైన్లో ప్రయాణించే వారు చాలా సందర్భాలలో వారి మోబైల్ ఫోన్ పోగొట్టుకోవడం.. లేదా దొంగల చేతి వాటానికి ఫోన్లు చోరీకి గురైన సంఘటనలు చూస్తూనే ఉంటాం. అలాంటి బాధితుల కోసం భారత రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు పోగొట్టుకున్న మోబైల్ ఫోన్లను ఈజీగా కనిపెట్టి ఇప్పించేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) భాగస్వామ్యంతో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు ప్రయాణీకులు రైల్ మదద్ ద్వారా లేదా 139కి డయల్ చేయడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్ వివరాలు చెప్పేందుకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది.

పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందడానికి, దొంగలించిన ఫోన్‌ను కనిపెట్టేందుకు, పునఃవిక్రయాన్ని నిరోధించడానికి ఈ పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR)లో మే 2024లో నిర్వహించిన పైలట్ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత అన్ని చోట్లా ఇప్పుడు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పైలెట్ ప్రాజెక్ట్‌లో చాలా మంది పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్లను తిరిగి పొందడం, మొబైల్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో రైల్వే ప్రయాణీకులకు పోగొట్టుకున్న ఫోన్లు త్వరగా తిరిగి పొందడంలో ఇది సహాయపడుతుందని RPF నమ్మకంగా ఉంది.
ఎలా పనిచేస్తుందంటే..?
ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్. పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తాల్సిన అవసరం లేదు. RPF జోనల్ సైబర్ సెల్ ఫిర్యాదును నమోదు చేస్తే అది CEIR పోర్టల్‌తో అటోమెటిక్‌గా లింక్ చేస్తంది. దీంతో మొబైల్ IMEI నంబర్‌ను బ్లాక్ చేస్తుంది, ఇది ఆ ఫోన్‌ను పనికిరానిదిగా చేస్తుంది. “కొత్త సిమ్ కార్డుతో పోగొట్టుకున్న ఫోన్ గుర్తించబడితే, దానిని సమీపంలోని RPF పోస్ట్‌కు తిరిగి ఇవ్వమని హెచ్చరిస్తుంది. అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా నిజమైన యజమాని వారి ఫోన్‌ను తిరిగి పొందవచ్చు.

నిబంధనలను పాటించని సందర్భాల్లో, RPF FIR దాఖలు చేసి, జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు” అని ఒక అధికారి తెలిపారు. బాధితులు వారి పూర్తి ప్రూఫ్‌ల కోసం రైలు టికెట్ ఫోటోను అప్లోడ్ చేయాలి. మొబైల్ దొరికిన వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది ఫోన్ చేసి చెబుతారు. మీరు మీ ఆధార్ కార్డు లేదా ఇతర ఐడీ కార్డు తీసుకెళ్లి చూపిస్తే మీ ఫోన్ అప్పగిస్తారు. మొబైల్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత CEIR పోర్టల్ ద్వారా ఆ ఫోన్‌ను అన్‌బ్లాక్ చేయవచ్చు.
ఇదికూడా చదవండి….

