మోసపూరిత పాల‌నను గ‌ద్దె దించుతాం

తాండూరు తెలంగాణ వికారాబాద్

మోసపూరిత పాల‌నను గ‌ద్దె దించుతాం
– ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచేందుకే ప్ర‌జాగోస – బీజేపీ భ‌రోసా యాత్ర‌
– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ
– మునుగోడు ఉప ఎన్నిక విజ‌యం మాదే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : హామిలను నెరవర్చకుండా ఇంకా మ‌భ్య‌పెట్టే పాల‌న చేస్తున్న సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించ‌డ‌మే బీజేపీ ల‌క్ష్య‌మ‌ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర మొదటి విడత సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు మండలంలో నిర్వచింహించారు. ఈ కార్యక్రమానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై బైక్ ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు తాండూరులోని బీజేపీ పార్టీ కార్యాలయంలో డీకే అరుణ మాజీ మంత్రి ఎ. చంద్ర‌శేఖ‌ర్ రావు, జిల్లా అధ్యక్షులు సదానందారెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్‌తో క‌లిసి మాట్లాడుతూ ఎన్నో ఆశయాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల ఆశయాలను అడియాశలు చేశారని విమర్శించారు. కేవలం తన కుటుంబానికి బంగారు తెలంగాణగా మార్చుకున్నారని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, 57 ఏండ్లకే ఆసరా ఫించన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. మునుగోడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొత్త‌గా ఫించన్ ఇస్తామని మరో మోసానికి సిద్దం అయ్యారని, ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు కొత్తగా ఫించన్లు ఇచ్చేందుకు ముందుకొ చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ఇచ్చే మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మోసాలతో పాటు కేంద్రం ద్వారా చేపట్టిన అభివృద్ధిని గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్య పర్చడంలో భాగంగానే బీజేపీ ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రం నిలబెట్టుకున్న హామిలను తెలిపి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఇక్కడి ఖనిజ సంపదతో ఆధాయాన్ని పొందిన ప్రభుత్వం కనీసం రోడ్లను అభివృద్ధి చేయలేని పాపాన పోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో గెలుపు గుర్రాలకే బీజేపీ టిక్కెట్టు ఇస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు 75 స్వాతంత్ర ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న ఆజాదికా అమృతోత్సవ్‌లో భాగంగా వివిధ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 9,10,11న ఇంటింటిపై జెండాలను ఆవిష్కరించి ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 12న మహానీయులకు నివాళులు తదితర కార్యక్రమాలు జరిపిస్తామన్నారు.