నాపరాతి వ్యాపారికి టోకరా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నాపరాతి వ్యాపారికి టోకరా..!
– లోడ్ తరలించేందు లారీలు పంపిస్తామని మోసం
– న్యూ మహావీర్ ట్రాన్స్పోర్ట్ పేరుతో సైబర్ వల
– రూ. 17500లు ఫోన్ పే చేయించుకున్న మోసగాళ్లు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నాపరాతిని తరలించేందుకు తక్కువ ధరకే లారీలు పంపిస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు తాండూరుకు చెందిన ఓ నాపరాతి వ్యాపారికి టోకరా వేశారు. తనకు జరిగిన మోసం ఎవ్వరికి జరగవద్దని బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈసంఘటన తాండూరు మండలం అంతారం గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

వివరాలిలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామానికి చెందిన మ్యాతరి అరుణ్ కుమార్ తాండూరు మండలం అంతారం గ్రామంలో పాలిషింగ్ యూనిట్లు కొనసాగిస్తున్నాడు. వివిధ ప్రాంతాలకు నాపరాతి లోడ్ తరలించేందుకు లారీలు తరలిస్తుంటారు. అయితే రెండు రోజుల క్రితం తాండూరు నుంచి అస్సాంలోని గోవాటిలో వ్యాపారికి నాపరాతి లోడ్ పంపించాల్సి ఉంది. ఈక్రమంలోనే అరుణ్ కుమార్ న్యూ మహావీర ట్రాన్స్ ఫోర్టు వారితో ఫోన్లో మాట్లాడారు. తనకు నాపరాతి లోడ్ తరలించేందుకు లారీ కావాలని అడిగారు. దీంతో బుధవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మహావీర ట్రాన్స్ పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి.. లోడ్ తరలించేందుకు లారీ(డబ్ల్యూబీ25 ఎల్ 3030)ని పంపిస్తామని, దాని ఆర్సీ కార్డు వాట్సాప్లో పంపించారు. వెంటనే డీజిల్ కోసం రూ. 17500లు ఫోన్ పే చేస్తే పంపిస్తామని చెప్పారు.

నిజమే అనుకుని అరుణ్ కుమార్ సెల్: 9621315968తో అంకిత్ కుమార్ కుశ్వాహా అనే పేరుకు రూ. 15వేలు ఒకసారి, మరోసారి రూ. 2500లు పంపించారు. చెప్పిన గడువు దాటినా కూడా లారీ రాకపోవడంతో అరుణ్ కుమార్ ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ చేసినట్లు వచ్చింది. అయితే కాసేపటి తరువాత అరుణ్ కుమార్ కు తీసుకున్న డబ్బులు రిటర్న్ చేసినట్లు న్యూ మహావీర్ ట్రాన్స్ పోర్టు పేరుతో ఓ ఫేక్ స్క్రీన్ షాట్ పంపించాడు. అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో మోసపోయినట్లు అరుణ్ కుమార్ నిర్దారించుకున్నాడు. తనకు జరిగిన మోసంపై అరుణ్ కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరుణ్ కుమార్ మాట్లాడుతూ న్యూ మహావీర్ ట్రాన్స్ ఫోర్టుకు ఫోన్ చేస్తే మధ్యలో ఉన్న కొందరు సైబర్ నేరగాళ్లు మన ఫోన్లను ట్రాప్ చేసుకుని కంపెనీ పేరుతో ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ముందుగా డిజిల్ కు డబ్బులు వేయండి.. అని చెప్పి లారీ, ఆర్సీ ఫోటోలు మన ఫోన్ కు పంపిస్తారని, ఇది నమ్మి తనలా ఎవ్వరు ట్రాన్స్ పోర్టు పేరుతో ఎవరైనా సంప్రదిస్తే మోసపోవద్దని సూచించారు.

ఇదికూడా చదవండి…

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి