అద్భుతం.. ఆవు పేడ రాఖీలు..!
– అనుబంధంతో పాటు ప్రకృతి రక్షణ
– ఇందులోని ప్రత్యేకతలు ఎంతో శ్రేష్ఠం
– తాండూరులో దక్కుతున్న ఆదరణ
– ప్రోత్సహిస్తున్న మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రస్తుత కాలంలో ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా వినియోగించే వస్తువులు అన్ని ఓ అద్భుతమనే చెప్పవచ్చు. ఒకప్పుడు రాఖీ పండగ అంటే పూర్తిగా పర్యావరణ హితంగా జరిగేది. దూదిని ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన రంగుల్లో ముంచి, పసుపు దారానికి కట్టి అక్కా చెల్లెళ్లు, అన్నా దమ్ముళ్లకు కంకణంగా కట్టుకునే వారు.

రాఖీ పండగ అంటేనే అనుబంధాలు, ఆత్మీయతకు ప్రతీక. అయితే రాఖీ పండగ రాను రాను పాశ్చాత్య పోకడలతో వికృత రూపం దాల్చింది. మెరుపులు, రసాయనాలతో తయారు చేసిన రాఖీలు వాడుకలోకి రావడంతో పండగ పర్యావరణానికి పెను ప్రమాదంగా మారింది. ఈ ప్రమాదం నుంచి పర్యావరణానికి కాపాండేందుకు ఆవు పేడ, గోమూత్రంతో తయారు చేసిన రాఖీలను అందుబాటులో ఉంచుతూ పర్యావరణ రక్షణకు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ మహత్కార్యానికి తాండూరు పట్టణంకు చెందిన మున్సిపల్ మాజీ చైర్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య ముందు వరుసలో నిలుస్తున్నారు.

గత కొన్నేళ్లుగా రాఖీ పండగా వచ్చినా… స్వాతంత్ర దినోత్సవం వచ్చినా, దీపావళీ పండగ వచ్చినా సహజ సిద్ధంగా ఆవు పేడ, గోమూత్రంతో తయారు చేసిన రాఖీలు, బ్యాడ్జీలు, దీపాంతాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఓ వైపు అవగాహన కల్పిస్తూనే వాటిని తయారు చేస్తున్న సంస్థను సైతం ప్రోత్సహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన శివరామకృష్ణా చారి అనే యువకుడు దీర్ఘాయిష్షు అనే సంస్థ తయారు చేస్తున్న ఆకృతులను ఆమె ప్రోత్సహిస్తున్నారు. ఈసారి కూడా రాఖీ పండగ సందర్భంగా ఆవు పేడ, గోమూత్రంతో తయారు చేసినా రాఖీలను ప్రోత్సహిస్తున్నారు. పండగ సందర్భంగా ఆవు పేడతో తయారు చేసిన రాఖీలను అందుబాటులో ఉంచారు.

తాండూరులో రాఖీ పండగ సందర్భంగా ఆవు పేడల రాఖీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆవు పేడ రాఖీలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆవు పేడ రాఖీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రాఖీలు అనుబంధ సంప్రదాయాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రకృతి రక్షణకు తోడ్పాటు అందించడం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఆవు పేడ రాఖీలు ఎంతో శ్రేష్ఠ్యం: కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య
రాఖీ పండగను ప్రకృతి సిద్దంగా జరుపుకోవడం మన సంప్రదాయం. ఈ పండగను దృష్టిలో ఉంచుకుని నా వంతుగా ఆవు పేడ రాఖీలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ రాఖీల వల్ల ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుంది. రాఖీ కట్టుకుని విడిచిన రోజు భూమిలో కలపడం వల్ల ప్రకృతికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి. అదేవిధంగా రాఖీని కట్టుకుంటే శరీరంలో వేడిని నియంత్రిస్తుంది. ఇలాంటి వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఇదికూడా చదవండి…

