బ్యాంకుకే బురిడి కొట్టే స్కెచ్..!
– నకిలీ నోట్లను మారుస్తూ అడ్డంగా బుక్
– మాయ జంటకు పదేళ్ల జైలు శిక్ష, జరిమాన
– వికారాబాద్ జిల్లా న్యాయస్థానం తీర్పు
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ జంట బ్యాంకును బురిడి కొట్టేందుకు స్కెచ్ వేశారు. నకిలీ నోట్లను మార్చేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యారు. తొమ్మిదేండ్ల క్రింద నమోదైన కేసులో వికారాబాద్ జిల్లా న్యాయస్థానం ఇద్దరికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించిందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలానికి చెందిన గోదాల అలవేలు, గణేష్ రెడ్డిలు 2016 మార్చి 10వ తేదిన తమ వద్ద ఉన్న నకిలీ నోట్లను స్థానిక విజయ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు యత్నించారు. గమనించిన బ్యాంకు అధికారులు వెంటనే పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి ఎస్ఐ ఇద్దరిపై U/s 489 (B), 489 (C) IPC (నకిలీ కరెన్సీని ఉపయోగించడం/కలిగి ఉండడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వికారాబాద్ జిల్లా న్యాయస్థానంలో కేసు విచారణ జరగగా ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20వేల జరిమాన విధిస్తూ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి శ్రీ డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

అదేవిధంగా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ కరెన్సీ తయారి, చలామణి వంటి నేరాలకు పాల్పడేవారు ఎంతటివారైనా చట్టం దృష్టిలో తప్పించుకోలేరని ఈ తీర్పు రుజువు చేసిందని పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో కీలక పాత్ర వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. సుధాకర్ రెడ్డి, దర్యాప్తు అధికారులు, ప్రస్తుత SDPO తాండూరు బాలకృష్ణ రెడ్డి, CIP వై. నగేష్, కోర్టు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

ఇదికూడా చదవండి…

