అర చేతిలోనే ‘మీసేవ’లు..!
– తెలంగాణ సర్కార్ ప్రత్యేక యాప్
– మొబైల్ నుంచే 270కి పైగా ప్రభుత్వ సేవలు
– ఏయే సర్వీసులు పొందవచ్చో తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రోజు రోజుకు సాంకేతిక రంగం విప్లవాత్మక మార్పులు తీసుకవస్తుంది. దీంతో అరచేతిలోనే ఇంటి వద్దనుంచే సేవలను పొందే వెసులుబాటు కలుగుతోంది.

మనకు ప్రభుత్వంతో ఏ అవసరం వచ్చినా, ముందుగా మీసేవ కేంద్రానికి వెళ్తుంటాం. తద్వారా చాలా పనులు అక్కడే అయిపోతుంటాయి. కొత్త పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, ఉన్న పథకాల్లో మార్పులు, ఆధార్, ఐడీ కార్డుల్లో మార్పులు ఇలా చాలా పనులకు మీసేవా కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. ఐతే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మీసేవ యాప్‌ని తెచ్చింది.
ఈ యాప్‌ని ప్రజలకు మరింత చేరువ చెయ్యడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ యాప్ సహాయంతో.. ఇంటి దగ్గర నుంచే ప్రజలు 270 రకాల పౌర సేవల్ని పొందేందుకు వీలవుతుంది. ఇందులో ప్రజలకు లభించే సేవల లిస్ట్ ఉంటుంది. అందులోంచీ కావాల్సిన సేవను ఎంచుకోవచ్చు. ఏవైనా పథకాల కోసం అప్లై చేసుకోవాలంటే, చేసుకోవచ్చు. అలాగే ఐడీ కార్డులలో మార్పులు చెయ్యాలన్నా చేసుకోవచ్చు.

ఈ యాప్‌ని మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని ప్లేస్టోర్‌లో Meeseva Connect అని సెర్చ్ చెయ్యాలి. ఈ యాప్‌ని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాక.. రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అది చాలా సింపుల్. మొబైల్ ఓటీపీ ద్వారా అవ్వొచ్చు. ఆ తర్వాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. వాటి ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఆ తర్వాత కావాల్సిన సేవల్ని పొందవచ్చు. ఒకవేళ ఈ యాప్‌ని ఆపరేట్ చెయ్యడం తెలియకపోతే, అప్పుడు దగ్గర్లోని మీసేవా కేంద్రానికి వెళ్లి, ఎలా ఆపరేట్ చెయ్యాలో వివరాలు చెప్పమని అడగొచ్చు. వారు అన్ని వివరాలూ చెబుతారు. ఈ యాప్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

