తండ్రిని గొడ్డలితో హత్య కొడుకు
– తల్లిని, చెల్లిని వేధిస్తున్నాడని దారుణం
– బాయిమీది తాండాలో ఘోరం
– నిందితుడిని అరెస్టు, రిమాండు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించడంతో పాటు తల్లిని, చెల్లిని వేధిస్తున్నాడని కుమారుడు తన తండ్రిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. పెద్దేముల్ మండలంలోని బాయిమీది తండాలో ఈ సంఘటన కలకలం రేపింది. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తండాకు చెందిన రాథోడ్ లోక్య నాయక్, బిక్కి బాయి దంపతులకు ముగ్గురు సంతానం. లోక్య నాయక్ మద్యానికి బానిసై తరచుగా భార్య బిక్కిబాయిని, ఇంట్లోనే ఉంటున్న చిన్న కుమార్తెను వేధిస్తుండేవాడు. శుక్రవారం ఉదయం కూడా లోక్య నాయక్ తన భార్య, కుమార్తెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త వేధింపులు భరించలేక తల్లి బిక్కి బాయి వెంటనే హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటున్న తన కుమారుడు రాథోడ్ సునీల్ నాయక్‌కు తెలిపింది. విషయం తెలుసుకున్న సునీల్ నాయక్ హైదరాబాద్ నుండి స్వగ్రామానికి చేరుకున్నాడు. తన తల్లి, చెల్లెలిని ఎందుకు కొడుతున్నావంటూ తండ్రిని నిలదీశాడు. తండ్రి కొడుకుల మద్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో సునీల్ నాయక్ ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని తండ్రి మెడ, దవడ, తల వెనుక భాగంలో బలంగా నరికాడు. లోక్య నాయక్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్దన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తండ్రిని హత్య చేసిన సునీల్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


