ఏకపక్షంగా ఎస్ఐఆర్ నమోదు..!
– అధికార పార్టీకి బీఎల్ఓల వత్తాసు
– సక్రమంగా పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
– బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల
– ఆర్డీఓ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్(ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) తాండూరులో ఏకపక్షంగా కొనసాగుతోందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల ఆరోపించారు.

బుధవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అనిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ఇన్‌చార్జులు హాజరై గ్రౌండ్ స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి కొందరు బీఎల్‌ఓలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలను పట్టించుకోవడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని, క్షేత్రస్థాయిలో తమతో కలిసి పనిచేసేందుకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. అంతేకాకుండా ఆర్డీఓ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏల జాబితా తమకు అందలేదని అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి చేయాల్సిన ఓటర్ల సవరణను అంగన్‌వాడీ కేంద్రాలు, ఇళ్లలో కూర్చొని, స్థానికంగా నివసించని వారిని పిలిపించి పెద్ద ఎత్తున దరఖాస్తులు నింపిస్తున్నారని ఆరోపించారు.

విధులను సక్రమంగా నిర్వహించని బీఎల్‌ఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఆర్డీఓ అనిత స్పందిస్తూ విద్యా పరంగా, సాంకేతిక పరిజ్ఞానం పరంగా బీఎల్‌ఓలు వెనుకబడి ఉండటంతో శిక్షణ ఇచ్చినా అవగాహన పెంచుకోలేదని అన్నారు. సూపర్‌వైజర్ల ద్వారా సమన్వయం చేస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీల బీఎల్‌ఏల జాబితాలను ఇప్పటికే బీఎల్‌ఓలకు అందజేశామని చెప్పారు. పరస్పరం సహకారం అందించుకునేలా దృష్టిసారిస్తామని అన్నారు. సమావేశంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


