బిల్లుల దోపిడికే ప్రాధాన్యం..!
– నీటి కోసం రూ. 2.80కోట్ల ఖర్చు
– ఛాయ్, బిస్కెట్లకే రూ. 7.50లక్షల దుబారా
– డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎంపికలో తొండి
– బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కక్షపూరిత వైనం
– మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బిల్లులు పెట్టుకుని దోచుకోవడమే ప్రాధాన్యంగా మున్సిపల్ పాలకవర్గం కొనసాగుతోందని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆరోపించారు.

శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆమె బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కౌన్సిల్‌లో నాలగవ కౌన్సిల్ సమావేశం జరిగినా కూడా పట్టణ అభివృద్ధి విషయంలో, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో శ్రద్ద వహించడం లేదని విమర్శించారు. తాండూరు పట్టణంలో గత ఆరు నెలలుగా నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికి కౌన్సిల్ నుంచి కేవలం రూ. 2.కోట్ల 80లక్షలు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు.

మిషన్ భగీరథ రాకపోతే ప్రత్యామ్నాయంగా పంపుహౌస్ మరమ్మత్తుల కోసం రూ. 45లక్షలు, పట్టణంలోని 36 వార్డుల్లో బోర్ల కోసం రూ. 90లక్షలతో పాటు ప్రత్యేక అధికారుల పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వార్డులలో వేసిన రూ. 60లక్షల బోర్ల బిల్లులను కూడా ఇందులో కలిపారని విమర్శించారు. మున్సిపల్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశాలు, ఇతర సమావేశాలలో ఫుడ్ బిల్లులను రూ. 7లక్షల 50వేలు చేశారని చెప్పుకోచ్చారు. అంటే ఛాయ్, బిస్కెట్ల కోసం రూ. 7.50లక్షల బిల్లులు దుబారా చేశారని విమర్శించారు.

సాధారణంగా రూ. 1లక్ష ఖర్చు దాటితే టెండర్లు ఆహ్వానించాల్సి ఉంటుందని, కాని వాటిని పక్కన పెట్టి 7.50 లక్షల బిల్లులు పెట్టి దోచుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా కార్యాలయంలో ఫర్నీచర్, ఇన్వేటర్ల పేరుతో అనసర బిల్లులు పెట్టుకున్నారని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ల విషయంలో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, ఆయా కౌన్సిలర్ల వార్డులలో కార్యక్రమాలు జరిగినా, అభివృద్ధి పనులు ప్రారంభించినా కౌన్సిలర్లకు సమాచారం అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఇంటి ముందు ఉన్న మెట్లను తొలగించాలని వేధింపులు చేస్తున్నారని, పట్టణంలోని మున్సిపల్ ముందే అక్రమాలు జరిగినా.. ఇతర వార్డుల్లో ఆక్రమణలు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల విషయంలో కూడా తొండికి పాల్పడ్డారని విమర్శించారు. జిల్లా కలెక్టర్, అధికారులు తప్పుదోవ పట్టేలా వ్యవహరించారని, ఈ విషయంలో సస్పెన్షన్ జరిగిన విషయాన్ని నిలదీసేందుకు సమయం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఈర్షాద్, అనిల్, సురేష్ నాయక్, యోగానంద్, రూపా రుద్రుపాటిల్, నవీన సంతోష్ గౌడ్, ఉమా మహేశ్వరి, సుప్రీత కరుణాకర్, నాగలక్ష్మీ తదితరులు ఉన్నారు.


