శ్రీచైతన్య చీటింగ్..!
– స్కూళ్లో పుస్తకాల విక్రమయాలు
– అధిక ధరలకు అమ్మకాలు
– ఆగ్రహించిన ప్రజా, విద్యార్థి సంఘాలు
తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ చీటింగ్‌కు పాల్పడింది. విద్యాశాఖ నిబంధనలు తుంగలొ తొక్కింది. పాఠశాలలో నోట్, పాఠ్య పుస్తకాల దందాకు తెరలేపింది.

గురువారం ఈ విషయం తెలుసుకున్న తాండూరు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్‌పై దాడి చేశారు. సీఐటీయూ, కేవీపీఎస్, పీడీఎస్‌యూ, టీఎస్‌ఎమ్మెచ్‌పీఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి నాయకులు ప్రిన్సిపల్, నిర్వహకులను నిలదీశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పుస్తకాలను ఎంఆర్‌పీ కంటే ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. స్కూల్‌కు చెందిన అకౌంటెంట్ బాలవర్ధన్ రెడ్డి అనే వ్యక్తితో అమ్మకాలు చేపట్టడంపై మండిపడ్డారు. ఫోన్ పే నంబర్‌కు డబ్బులు వేయించుకుని అమ్మకాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుస్తకాలు కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకవరావడంపై రగిలిపోయారు. డబ్బులు తీసుకున్న వారం రోజుల తర్వాత పుస్తకాలు ఇస్తామని సాకులు చెబుతూ మోసం చేయడంపై మండిపడ్డారు. విక్రయాలు బయటకు తెలియకుండా రాత్రివేళల్లో డోర్ డెలివరీ చేయడాన్ని నిలదీశారు. ఈ విషయాన్ని మండల విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన విద్యాధికారి ఇందుప్రియ పాఠశాలను సందర్శించారు. స్కూళ్ల విక్రయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ ఆఫీసును సీజ్ చేసి, కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అకౌంటెంట్ బాలవర్ధన్ రెడ్డిపై కుల వివక్ష చూపినట్లు ఆరోపణలు రావడంతో, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎమ్మెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహాబ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, తాండూరు ఇంచార్జ్ మొహమ్మద్ సాధిఖ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కే. చంద్రయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


