రాజీవ్ యువ వికాసం ఇంకెప్పుడో..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రాజీవ్ యువ వికాసం ఇంకెప్పుడో..!
– ఏడాది దాటిన అందని ఆర్థిక సాయం
– తెలంగాణ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
– ఇంకా ఎటు తేల్చని సర్కారుతో అసహనం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడం కోసం చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తులకే పరిమితమైంది. దరాఖాస్తులకు ఏడాది గడిచినా ప్రభుత్వం ఎటు తేల్చలేకపోవడంతో అసహనంకు గురవుతున్నారు.

ఈ పథకానికి వేలాది మంది యువకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రుణాలు వస్తే స్వయం ఉపాధితో ఆర్థికంగా లాభపడవచ్చని భావిస్తే పథకానికి బ్రేక్ వేస్తూ ప్రభుత్వం లబ్దిదారుల ఆశలపై నీళ్లు చల్లిచట్లుగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం యువకులు, ప్రభుత్వ ఉద్యోగులే అని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకనే యువత సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టింది. స్వయం ఉపాధి పొందేందుకు అందిస్తున్న రుణాల కోసం పల్లెల నుంచి పట్టణాల వరకు యువత వేలాది సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు.

మొదట గత యేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రుణాలు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం దరఖాస్తుల పరిమాణం అంచనాలను మించిపోవడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసిందని చెప్పవచ్చు. అనంతరం ఈ పథకాన్ని విడతల వారిగా అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాని నేటి వరకు ఎలాంటి పురోగతిని చూపించలేకపోవడంతో పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యువ వికాసం ద్వారా రుణాలు అందించాలని కోరుతున్నారు.

మంజూరు చేసే యూనిట్లు ఇవీ..
చిన్నయూనిట్ల కింద రూ.50 వేలతో జిరాక్స్‌ మిషన్లు, ఫొటో ఫ్రేమ్స్, రెగ్జిన్‌ కవర్లు, పచ్చళ్లు, మసాలా వస్తువులు, పాల బూత్, క్లాత్‌ మ్యాచింగ్‌ కేంద్రం, స్టాంప్‌ వెండర్, టైలరింగ్, చికెన్, మటన్‌ సెంటర్‌ తదితర 49 రకాలు ఉన్నాయి. రూ.1 లక్షతో అందించే యూనిట్లలో బుక్‌ బైండింగ్, బ్యాంగిల్‌ స్టోర్, సెల్‌ఫోన్‌ సర్వీసింగ్, జ్యూస్‌ పాయింట్, కిరాణం దుకాణం, పాడిగేదె, వెల్డింగ్‌ దుకాణం, టిఫిన్‌ సెంటర్‌ తదితర 45 రకాలు, రూ.2 లక్షలతో ఆటో మొబైల్‌ దుకాణం, బేకరీ, బ్యూటీ పార్లర్, కర్రీ పాయింట్, ఇంటర్‌నెట్‌ సెంటర్, ఎలక్ట్రిక్‌ దుకాణం, మినీ ఫ్లోర్‌మిల్, పేపర్‌ ప్లేట్ల తయారీ, ఫొటోగ్రఫీ, బుక్‌స్టాల్, టెంట్‌హౌస్‌ తదితర 61 రకాల యూనిట్లను గుర్తించారు. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలతో సెంట్రింగ్‌ యూనిట్లు, త్రీవీలర్‌ వాహనాలు, మెడికల్‌ షాప్‌ తదితర వ్యాపారాలను గుర్తించారు. వీటిలో లబ్ధిదారులు ఎంచుకున్న పథకానికి నిధులు మంజూరు చేసి అందించాల్సి ఉంది.

రాయితీ కల్పిస్తారిలా..
రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని గతంలో ఆర్థిక స్వావలంబన పథకంగా (ఎకనామికల్‌ సపోర్ట్‌ స్కీ) అమలు చేసేవారు. ఈ పథకం కింద నాలుగు రకాల యూనిట్లు ఉంటాయి. వాటిలో రూ.50 వేల రుణం వంద శాతం రాయితీ, రూ.లక్ష విలువైన యూనిట్‌కు 90 శాతం, రూ.2 లక్షల యూనిట్‌కు 80 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల యూనిట్‌కు 60 శాతం చొప్పున రాయితీని రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ ద్వారా అందిస్తారు.

31 నుంచి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు