ఆటలో ఘర్షణ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఆటలో ఘర్షణ..!
– విద్యార్థుల మద్య గలాట
– తాండూరులో ఉద్రిక్తత
– ఎంజేపీ గురుకులంలో ఘటన
– పోలీస్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదులు..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల మద్య జరిగిన ఆట ఘర్షణకు దారి తీసింది. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మహాత్మ జ్యోతిబా పూలే(ఎంజేపీ) గురుకుల పాఠశాలలో శనివారం జరిగిన ఈ సంఘటన ఉద్రిక్తంగా మారింది.

ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు సంబంధించిన కుటుంభీకులు పెద్ద ఎత్తున పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థులకు తాండూరులోని రహమానియా పాఠశాల విద్యార్థులకు శనివారం పుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఓటముల విషయంలో విద్యార్థుల మద్య మాట మాట పెరిగింది.

చిన్న గలాటా కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తమ కుటుంబీకులకు తెలియజేయడంతో విషయం తెలుసుకున్న వారు పాఠశాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో మరోసారి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల కుటుంభీకులు ఒకరికొకరు దాడులు చేసుకోవడంతో ఇరువర్గాలు గాయపడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. ప్రైవేటు స్కూల్ విద్యార్థుల కుటుంభీకులు తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్‌కు చేరుకుని విద్యార్థులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాల నుంచి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. మరోవైపు పరిస్థితిని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సమీక్షించారు.

కష్టం మాది.. క్రెడిట్ మీదా..!