కష్టం మాది.. క్రెడిట్ మీదా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కష్టం మాది.. క్రెడిట్ మీదా..!
– మాజీ కౌన్సిలర్ మమతా నాగరాజు
– 7వ వార్డులో సీసీ రోడ్ల పనులపై విమర్శ
తాండూరు, దర్శిని ప్రతినిధి : కష్టపడి నిధులు మేము తీసుకవస్తే.. క్రెడిట్‌ సొంతం చేసుకోవడం విడ్డూరంగా ఉందని 7వ వార్డు మాజీ కౌన్సిలర్ బాతుల మమత నాగరాజు విమర్శించారు.

వార్డులో ప్రారంభించిన సీసీ రోడ్ల అభివృద్ధి పనులపై స్పందించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే ఏడో వార్డులో అభివృద్ధి పనుల కోసం రూ.50 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరు చేయించామని, అందులో రూ.44 లక్షలతో పనులు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. మిగిలిన నిధులతోనే ప్రస్తుతం ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

తాము కృషి చేసి తీసుకొచ్చిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులకు కొందరు నాయకులు ఇప్పుడు ముందుండి ఫొటోలు దిగుతూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మమతా నాగరాజు విమర్శించారు. ‘సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టుగా ఫోజులు ఇవ్వడం కాదు. అభివృద్ధిపై నిజంగా శ్రద్ధ ఉంటే మీరే కష్టపడి నిధులు తీసుకురండి.. పనులు చేయించి చూపించండి’ అని అన్నారు.

ఎన్నికలకు ముందే 7వార్డులోని రాయల్ కంట సమీపంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. వార్డులో అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం, వాటిని మంజూరు చేయించి పనులు పూర్తి చేయించడం తమ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. పనులు ప్రారంభించిన నాయకులు ఇప్పుడు తీసుకవచ్చింది కేవలం రూ.5లక్షల పనులే అని, అవికూడా టెండర్‌ దశలోనే ఉన్నాయని ఆరోపించారు. అభివృద్ధి పనుల విషయంలో ఫొటోలకే పరిమితం కాకుండా ప్రజలకు అవసరమైన నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టాలని సూచించారు.

వార్డు అభివృద్ధే ధ్యేయం..!