రాఖీ కట్టి.. రక్షణ బంధాన్ని చాటి
– ఎస్కేటీఎస్ విద్యార్థుల పండగ సందడి
– అధికారులకు, నేతలకు రక్షా బంధన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ‘నీవు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనందరం దేశానికి రక్ష’ అంటూ ఎస్కేటీఎస్ విద్యార్థులు రాఖీ పండగ సందేశాన్ని చాటి చెప్పారు.

తాండూరులోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ (ఎస్కేటీఎస్)లో ముందుగానే మొదలైంది. రక్షా బంధన్‌ను పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా విద్యార్థులు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు రాఖీలు కట్టారు.

మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, ఆర్డీఓ అనితకు విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తహసీల్దార్ తారాసింగ్, ఎస్ఐ నూమన్ అలీ, మున్సిపల్ కమిషనర్ రాకేష్‌రెడ్డి, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రవీణ్‌కుమార్ తదితరులకు రాఖీలు కట్టారు. అంతకుముందు పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తమ్‌రెడ్డి, డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్‌రెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు విద్యార్థులు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రక్షా బంధన్ వంటి పండగల ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం తెలియజేయడం అభినందనీయమన్నారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. రాఖీ బంధం కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికే పరిమితం కాకుండా సమాజంలో పరస్పర రక్షణ, బాధ్యత, సోదరభావానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, అనిల్, పాఠశాల ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


