వాహనదారులకు గుడ్‌ న్యూస్..!

టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

వాహనదారులకు గుడ్‌ న్యూస్..!
– ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్లు
– ఏర్పాట్లు చేసిన రవాణా శాఖ
– ఎలాంటి ఉపయోగాలు తెలిస్తే షాక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మనం ఏ వాహనం కొన్నా రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఎంత పెద్ద ధనవంతులైనా, సెలబ్రిటీలు అయినా, స్టార్స్‌ అయినా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూసే ఉంటాం. వాళ్లకు అంటే నిమషాల్లో పని అయిపోతుంది. అది వేరే విషయం అనుకోండి.

అయితే సామాన్యులు, పేదలు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చుక్కలు చూడాల్సిందే. ఇకపై అలాంటి బాధలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఇకపై ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి వేచి చూడాల్సిన పనిలేకుండా చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయంతో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌(టీఆర్‌) లాగే.. శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చే బాధ్యతలను ప్రభుత్వం షోరూం డీలర్లకు అప్పగించనుంది. ఈ ప్రక్రియ వచ్చేనెల నుంచి అమలయ్యే అవకాశముందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఉపయోగాలు ఇలా
అన్ని పత్రాలు తీసుకొని రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. రాకపోకలు, రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేది. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం మరీ ఎక్కువగా ఉండేది. ఇకపై ఆ సమస్య తీరనుంది. డీలరు వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్‌ కానుంది. అన్ని పన్నులు షోరూం డీలరు ముందే వసూలు చేస్తున్నా.. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పత్రం మాత్రమే ఇచ్చేవారు. ఇకపై అలాంటి సమస్యలు తొలగిపోతాయి. మరోవైపు బైకు, కారు వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఫ్యాన్సీ నంబరు కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తోపాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రవాణాశాఖ నిబంధనలు, అదనపు రుసుం చెల్లిస్తే కావాల్సిన నంబరును రవాణాశాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం సమయం పడుతుంది.

ఎలా అమలు చేస్తారంటే..?
రవాణా శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం పక్కాగా అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. దీని కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించనున్నారు. డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునే కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నారు. తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిని ఆర్టీఏ కార్యాలయంలో అన్ని పత్రాలు పరిశీలించి ఆమోదం తెలుపుతారు. వచ్చేనెల నుంచి ఈ విధానం అందుబాటులోకి రానుంది.

ఇదికూడా చదవండి…

పట్లోళ్ల నర్సింలుకు.. సాటెవ్వరు..!