చేయూతకు మరో ఛాన్స్..!
– దరఖాస్తుల గడువు పొడగింపు
– ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

గతంలో ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు సోమవారంతో గడువు ముగియాల్సి ఉంది. అయితే అర్హులైన పలువురు ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయామని, మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో గడువును పొడిగించారు.

చేయూత పెన్షన్లపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు నమోదయ్యాయి. ఆగస్టు 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మంది అర్హులు ప్రయోజనం పొందేలా ప్రభుత్వం గడువును మరో 15 రోజులు పెంచింది.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన వర్గాలకు చేయూత పెన్షన్ సామాజిక భద్రతలో కీలకంగా మారింది. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని వారికి తాజా నిర్ణయం ఉపశమనంగా మారనుంది. గడువు పొడిగింపును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తు వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హులు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.


