మోడీ పాలనలోనే దేశం సుభిక్షం..!
– అవినీతి లేకుండా అన్నివర్గాల సంక్షేమం
– ఓర్వలేకనే రాహుల్‌గాంధీ రాజీనామ మంత్రం
– తెలంగాణలో కమీషన్లు, పర్సంటేజీల దోపిడి
– బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో అదే తంతు
– ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ జెండా ఎగరాలి
– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో బీజేపీ, ప్రధాన నరేంద్ర మోడిల ద్వారానే సుభిక్ష పాలన అందుతోందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.

ఆదివారం తాండూరు పట్టణం వీరశైవ కళ్యాణ మండపంలో వికారాబాద్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులుగా యు.రమేష్ కుమార్ పదవి ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే 18 కోట్ల సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ బీజేపీనే అని అన్నారు. 12 ఏండ్లుగా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడి, అమిషాల ఆధ్వర్యంలో ఎలాంటి దుర్వినియోగం, అవినీతి లేని పాలన అందిస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో దేశ ప్రజలకు విశేష సేవలను అందించిందని గుర్తుచేశారు. పేదలకు రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలు, రైతులకు ఆర్థిక సాయం పథకాలను అమలు చేస్తుందని అన్నారు.

ఇదంతా ఓర్వలేక రాహుల్ గాంధీ మోడి రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసినందుకు రాజీనామా చేయాలా, దేశంలో ఉగ్రవాదం, మతకలహాలు లేకుండా చేసినందుకు రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో బీసీలను ప్రధాన మంత్రి, రాష్ట్రాలను ముఖ్యమంత్రులుగా చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే లక్షల కుంబకోణాలు చేసిందని ఆరోపించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని కమీషన్లు, పర్సంటేజీల పాలనగా మార్చిందని విమర్శించారు. రియల్ ఏస్టేట్ చేయాలన్నా, ప్లాట్లు కొనాలన్నా, భవనం కట్టాలన్నా.. కమీషన్లు, పర్సంటేజీలను వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, ఇదేవిధంగా చేస్తున్నారని అన్నారు. గతంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, చేయాలన్నా, అవినీతి లేని పాలన జరగాలన్నా తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో జిల్లా అధ్యక్షులు యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అందరు ఐక్యమత్యం, సమిష్టిగా పనిచేసి మూడు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రామ్, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండలాల నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


