రాజీనామాకు తయార్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాజీనామాకు తయార్..!
– అవినీతి, అక్రమాలు నిరూపిస్తే రెడి
– మాజీ ఎమ్మెల్యే చిట్టాపై చర్చకు సిద్దం
– నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తన రాజకీయ అనుభవంలో ఎక్కడైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన, నియోజకవర్గ అభివృద్ధిపై కీలక వాఖ్యలు చేశారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి, ఆరు గ్యారెంటీల అమలుకు పెద్దపీట వేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహలక్ష్మీ, పేదలకు రేషన్ వంటి పథకాలను సమర్థవంతంగా చేపట్టిందన్నారు. గతంలో 9న్నర ఏండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామిలను అమలు చేయకపోవడమే కాకుండా అప్పుల పాలు చేసిందని విమర్శించారు. తాండూరులో కూడా ఉత్తుత్తి శిలాఫలాకాలు వేసి మభ్య పెట్టే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నుంచే పక్కా ప్రోసిండింగ్స్, నిధులు తీసువకచ్చిన తరువాతే పనులు ప్రారంభించడం జరిగిందని గుర్తుచేశారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు.

హైదరాబాద్‌–వికారాబాద్‌–తాండూరు రహదారితో పాటు చిలకవాగు నుంచి జాతీయ రహదారి వరకు, బషీరాబాద్‌–కరణ్‌కోట రహదారి అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. కోట్‌పల్లి ప్రాజెక్టు నిధులు, ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగిందని, జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. బషీరాబాద్‌లో జూనియర్‌ కళాశాల ఏర్పాటుతో పాటు 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ఐసీయూనుకూడా తీసుకరాలేని దద్దమ్మలు.. గత పాలకులు అని ద్వజమెత్తారు. అదేవిధంగా రూ. 110 కోట్లతో కాగ్నా తాగునీటి పథకం ద్వారా తాండూరు, కోడంగల్‌లోని 14 గ్రామాలకు తాగునీరు అందించేందుకు దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. తాండూరు కాగ్నానది నీటిని కోడంగల్‌కు కొత్తగా తరలించడం లేదని, గతంలోనే నీటీ సరఫరా జరుగుతుందని తెలియని విజ్ఞులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదన్నారు. అదేవిధంగా తాండూరులో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు సాంకేతిక నైపుణ్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఏటీసీలో జపనీస్‌ కోర్సును ప్రవేశపెట్టి, శిక్షణ పొందిన యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు ఈ ఏడాది నుంచి నెలకు రూ.2 వేల స్టైపెండ్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌ను ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగించుకోవాలని మనోహర్‌రెడ్డి సూచించారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, అధికారులు కలిసి ప్రజా సమస్యలపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకు బదులుగా ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై తాండూరు మాజీ ఎమ్మెల్యే చేసిన వాఖ్యలకు స్పందిస్తూ గతంలో ఆయనలాగ ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అవినీతికి పాల్పడలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఐదేళ్లు ఆయన చేసిన చిట్టా తెలుసని, దానిపై బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ చేశారు. ఒకవేళ తన రాజకీయ జీవితంలో ఆక్రమణలు, అవినీతి పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసేందుకు తయారుగా ఉన్నానని అన్నారు.

రాద్దాంతాలకే ప్రాధాన్యం..
మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు రాద్దాంతాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఓ కౌన్సిలర్ కౌన్సిల్ ఎజెండాను చించేసి.. వెళ్లిపోవడంపై మండిపడ్డారు. మరో కౌన్సిలర్ సమావేశం ప్రారంభంలోనే కావాలనే డీజీల్ వ్యవహారంపై హంగామా చేశారని అన్నారు. మున్సిపల్‌లో 14 ఆటోలు, 5ట్రాక్టర్లు, జేసీబీలు నిత్యం నడుస్తున్నాయని తెలిపారు. గతంలో సుమారు రూ. 3లక్షల 60వేలు వినియోగం జరిగితే.. ప్రస్తుతం రూ. 30వేలకు తగ్గిందని అన్నారు. డీజిల్ దుబారాను తగ్గించడం జరిగిందని స్పష్టం చేశారు. బుధవారం 18 అంశాలతో కూడిన కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పార్టీలకతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమీషనర్ రాకేష్‌ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాలనీలకు ప్రత్యేక పేర్లు..!