బీసీ స్మశానాలపై ఎందుకింత చిన్నచూపు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీ స్మశానాలపై ఎందుకింత చిన్నచూపు..!
– డంపింగ్ యార్డ్ లా మారినా పట్టించుకోరా
– అభివృద్ధిపై ఐదు రోజుల్లో కార్యాచరణ ప్రకటించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓట్ల సమయంలో గుర్తొచ్చే బీసీలు.. వారి చివరి మజిలీకి మాత్రం ఎందుకు గుర్తుకురావడం లేదని తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్‌ కందుకూరి రాజ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. పట్టణంలోని బీసీ శ్మశానవాటికల దుస్థితిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మంగళవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో నాయకులతో కలిసి పాత తాండూరు, తాండూరులోని బీసీ స్మశాన వాటికలను ఆయన పరిశీలించారు.తాండూరు పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న శ్మశానవాటికలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రాజ్‌కుమార్‌ మండిపడ్డారు.

ఎక్కడ చూసినా చెత్తాచెదారం, పెరిగిపోయిన ముళ్లపొదలు కనిపిస్తున్నాయని.. బహిరంగ మూత్ర, మల విసర్జనతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చెత్తను తీసుకొచ్చి శ్మశానవాటికలో వేయడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సిన ప్రదేశం కాస్తా డంపింగ్‌ యార్డుగా మారిపోయిందని విమర్శించారు. ప్రజల చివరి ప్రయాణానికి గౌరవం కల్పించాల్సిన ప్రదేశాలపైనే ఇంతటి నిర్లక్ష్యమా అని నిలదీశారు. శ్మశానవాటికల దుస్థితిపై గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతులు అందించినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

ఇప్పటికైనా బీసీ స్మశాన వాటికల అభివృద్ధికి శ్రద్ధ చూపించాలని అన్నారు. తాండూరులోని బీసీ స్మశానవాటికల అభివృద్ధికి రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసి, ప్రహరీ, గేటు, విద్యుత్‌, లైటింగ్‌, నీటి వసతి, షెడ్లు, డ్రైనేజీ, పారిశుధ్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. శ్మశానవాటికల సమస్యను తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఐదు రోజుల్లోగా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కందుకూరి రాజ్‌కుమార్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్‌, నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు పరమేశ్‌, మంతటి రాజు, నరహరి గోపాల్‌, నవీన్‌, శివ, రమేష్‌, రవి, శ్రీను, కిరణ్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి