అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!
– ఒకే రోజు మూడు చోట్ల చోరీలు
– సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి దొంగలు హల్‌ చల్ చేశారు. ఒక్కచోట కాదు.. ఒకే రాత్రి మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు.

తాండూరు పట్టణం, యాలాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన వరుస చోరీలతో శివారు ప్రాంతాల ప్రజల్లో టెన్షన్‌ నెలకొంది. తాండూరు-కొడంగల్‌ రహదారిలోని శ్రీరామ్‌నగర్‌లో అర్ధరాత్రి 3 గంటలు దాటిన తర్వాత సతీష్‌ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. సుమారు 10 తులాల బంగారం, రెండు కిలోల వెండి, లక్షల నగదు అపహరించినట్లు సమాచారం.

అంతా పక్కాగా చేసినట్లే కనిపించినా.. ఎదురింటి సీసీ కెమెరా మాత్రం దొంగల చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. అదే కాలనీలో మరో ఇంట్లో కూడా దొంగలు చొరబడి వెండి ఆభరణాలు, నగదును అపహరించినట్లు తెలిసింది. వరుసగా రెండు ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇక సాయిపూర్‌ జానకీనగర్‌లో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది.

రుక్మాపూర్‌ సర్పంచ్‌ బాలరాజు, ఆయన మిత్రుడు రఘునందన్‌ రెండు బైక్‌లను ఇంటి వద్ద పార్క్‌ చేసి కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు అర్ధరాత్రి ఆ రెండు బైక్‌లను ఎత్తుకెళ్లారు. బైక్‌లు అపహరిస్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వరుస ఘటనలపై యాలాల, తాండూరు పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోట్లీ మహరాజ్‌ దేవస్థానంలో అవినీతి..!