బుయ్యనిపై బురదజల్లితే.. ఖబడ్దార్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బుయ్యనిపై బురదజల్లితే.. ఖబడ్దార్‌..!
– ఆధారాలుంటే బయటపెట్టండి
– బహిరంగ చర్చకు ఎమ్మెల్యే తరఫున మేమే వస్తాం
– మాజీ ఎమ్మెల్యే, ప్యాకేజీ లీడర్ గురించి అందరికి తెలుసు
– మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నేతల ఎదురుదాడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు.

భూకబ్జాలకు సంబంధించి చేసిన ఆరోపణలపై ఆధారాలుంటే బయటపెట్టాలని, బహిరంగ చర్చకు ఎమ్మెల్యే అవసరం లేదని.. ఆయన తరుపున వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాతుల నాగరాజు, మాజీ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌ మాట్లాడారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ఓర్వలేకపోతున్నారని అన్నారు. రూ. 3500 కోట్లతో ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రోహిత్‌రెడ్డి తాండూరుకు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

తాండూరులో దేవాలయాలు, బడులను అభివృద్ధి చేస్తున్న ఘనత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఎమ్మెల్యే అన్ని పార్టీల కౌన్సిలర్లను సమానంగా చూస్తున్నారని, ప్రతి వార్డును అభివృద్ధి చేసేందుకు సహకరిస్తున్నారని అన్నారు. రూ. 110 కోట్లతో తాండూరు కాగ్నానది నీళ్లను రెండుపూటలా తాపేందుకు ప్రయత్నం చేయడం పాపమా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సోదరుడు కూడా తాండూరు అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రాజుగౌడ్‌ ఎమ్మెల్యేను విమర్శించే స్థాయిలో లేరని, ఆయన ప్యాకేజీ లీలలు అందరికి తెలుసని వ్యాఖ్యానించారు. గతంలో మహేందర్‌రెడ్డి వెంట ఉన్న కొందరు నేతలే ఇప్పుడు రోహిత్‌రెడ్డి వెంట ఉన్నారని, గత ఎన్నికల్లో రోహిత్‌రెడ్డి ఓటమికి వారే కారణమని విమర్శించారు. తాండూరు అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మనోహర్ రెడ్డి చాలా ఏండ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో పార్ట్నర్లతో వ్యాపారం చేస్తున్నారని గుర్తు చేశారు. మనోహర్‌రెడ్డిపై మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బహిరంగ చర్చకు వచ్చేందుకు ఎమ్మెల్యే అవసరం లేదని, ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టండి.. మేమే వస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌, వైస్‌చైర్మన్‌ ఖాసిం అలీ, కౌన్సిలర్‌ దివిటి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

గణనాథుల ఆగమనంపై ఆంక్షలు వద్దు..!