రోహిత్‌రెడ్డి విమర్శించే స్థాయి నీకు లేదు

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత్‌రెడ్డి విమర్శించే స్థాయి నీకు లేదు
– గతం గుర్తించుకుని మాట్లాడితే మంచిది
– కాంగ్రెస్ టౌన్‌ అధ్యక్షునికి కౌంటర్
– తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజుకు లేదని, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని 7వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ హితవు పలికారు.

రోహిత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నాగరాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఓ ప్రకటనలో ఘాటుగా స్పందించారు. గతంలో రోడ్డు పక్కన జరిగిన వివాదాలు, ఆర్థిక వ్యవహారాలు, ఎన్‌టీఆర్ కాలనీకి సంబంధించిన ఓ ఘటన, వాగు నుంచి మట్టి తరలింపు తదితర అంశాలపై నాగరాజుపై ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు.

వాటిపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ఇతర నాయకుల గురించి మాట్లాడాలని సూచించారు. ఇటీవలే రోహిత్‌రెడ్డిని కలిసి పని కోసం సహాయం కోరిన వ్యక్తి ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేయడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత స్థాయికి దిగజారి మాట్లాడటం సరికాదన్నారు.

రోహిత్‌రెడ్డిపై ఏవైనా ఆరోపణలు చేస్తే వాటికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. పైలట్ రోహిత్‌రెడ్డిపై మాట్లాడే ముందు తన స్థాయి ఏమిటో నాగరాజు తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెబుతామని, తమ నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేస్తే తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు.

మచ్చలేని ఎమ్మెల్యే మనోహరన్న..!