ఆసుప్రతి వద్దే.. అపరిశుభ్రత ఘోరం..!
– కాయకల్ప అవార్డు దవాఖాన దయనీయం
– ఎమ్మెల్యే, కలెక్టర్, చైర్ పర్సన్ దృష్టి పెట్టాలి
– బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగాలను నయం చేసుకునేందుకు వచ్చే ఆసుపత్రి వద్ద అపరిశుభ్రత ఘోరంగా ఉందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆవేధన వ్యక్తం చేశారు.

గురువారం తన వార్డు పరిధిలోని మాతా శిశు ఆసుపత్రి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మాతా శిశు ఆసుపత్రి వద్ద పరిసర ప్రాంతాలు ఘోరమైన ఆపరిశుభ్రతతో కనిపిస్తోందని అన్నారు. పరిశుభ్రతలో కాయకల్ప అవార్డులు పొందిన మాతా శిశు ఆసుపత్రి దయనీయ స్థితిలోకి వెళ్లిపోతుందని ఆవేధన వ్యక్తం చేశారు.

అదేవిధంగా ఆసుపత్రి నుంచి వచ్చే మురుగు కాలనీలోకి వెళ్లుతుందని, దీంతో కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దీనికి ప్రత్యేక మురుగు కాలువను నిర్మించాలని డిమాండ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు సమీపంలో ఉన్న ఆసుపత్రిపై దృష్టిసారించడం లేదని అన్నారు.

జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్, సూపరిండెంట్‌లు ఆసుపత్రి దుస్థితిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయాలని మా డిమాండ్ అని, అడిగిన వారిపై టార్గెట్ చేసుకుని భయబ్రాంతులకు గురిచేస్తే బెదిరేది లేదని అన్నారు.


