మృత్యు ‘ఢీ’సీఎం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మృత్యు ‘ఢీ’సీఎం..!
– స్కూటీపై వస్తున్న విద్యార్థులకు ఢీ
– ఒకరి దుర్మరణం, ఇద్దరికి గాయాలు
– తాండూరు మండలం అంతారం సమీపంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న స్కూటీని ఓ డీసీఎం మృత్యువు రూపంలో దూసుకోవచ్చింది.

స్కూటీని బలంగా ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఓ విద్యార్థి దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తాండూరు పట్టణం ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన వడ్డె శేఖర్(6వ తరగతి), గోవర్దన్‌(9వ తరగతి)లు పెద్దేముల్ మండలం గొట్లపల్లి సమీపంలోని మోడల్‌ స్కూల్లో చదువుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన సాత్విక్(15) తాండూరు పట్టణంలోని నెంబర్ వన్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే గురువారం సాయంత్రం సాత్విక్ స్కూటీపై గొట్లపల్లి సమీపంలోని మోడల్‌ స్కూల్‌ నుంచి శేఖర్, గోవర్దన్‌లను స్కూటీపై ఇంటికి తీసుకవస్తున్నాడు.

తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న డీసీఎం స్కూటీని ఢీ కొట్టింది. ఈక్రమంలో స్కూటీ నడిపిస్తున్న సాత్విక్ తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మిగతా ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించి.. చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు. గాయపడిన విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు సాత్విక్ మృతితో తల్లీ, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించడం కలచివేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆసుప్రతి వద్దే.. అపరిశుభ్రత ఘోరం..!