పేదల సొంతింటి కలకు.. ఇందిరమ్మ భరోసా

తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల సొంతింటి కలకు.. ఇందిరమ్మ భరోసా
– రెండో విడత లబ్దిదారులకు సడలింపు ఇవ్వాలి

– అసెంబ్లీలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల కలను ఇందిరమ్మ ఇండ్ల పథకం సాకారం చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.

గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి నిధుల విడుదల వరకు ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు.

గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ఇళ్లు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు చేసుకుంటున్న లబ్ధిదారుల ఆనందాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే తొలి విడత ప్రారంభమై, రెండో విడత పనులు కూడా ప్రారంభమయ్యాయని మనోహర్‌రెడ్డి తెలిపారు.

అయితే రెండో విడతలో నిబంధనల కారణంగా అర్హత ఉన్నప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్‌2, ఎల్‌3 కేటగిరీల నిరుపేదలకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజమైన పేదలకు సొంతింటి అవకాశం దక్కేలా నిబంధనలను పరిశీలించి అవసరమైన సడలింపులు ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.

ఐలమ్మ జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలి