లైట్ల కోసం.. స్థంభం ఎక్కిన కౌన్సిలర్..!
– పాలకవర్గ నిర్లక్ష్యం పట్ల జావీద్ వినూత్న నిరసన
– అధికారుల స్పందన లేక.. తానే రంగంలోకి దిగిన వైనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తన వార్డులో వీధిదీపాల కొరతపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో.. తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ టీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ స్వయంగా విద్యుత్ స్తంభం ఎక్కి వీధిదీపాన్ని బిగించారు.

శుక్రవారం వార్డులో స్థంబాలను ఎక్కి లైట్లను బిగించారు. వార్డులో చీకట్లు అలుముకుంటున్నా సమస్య పరిష్కారం కాకపోవడంపై రాత్రి జావీద్ నిరసన చేపట్టారు. కౌన్సిలర్ స్వయంగా స్తంభం ఎక్కి లైట్ ఏర్పాటు చేయడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా జావిద్ మాట్లాడుతూ తన వార్డులో సుమారు 300–400 విద్యుత్ స్తంభాలు ఉండగా, కేవలం 18 వీధిదీపాలు మాత్రమే కేటాయించారని జావీద్ తెలిపారు.

లైట్ల నిర్వహణకు సిబ్బంది లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయి ఎనిమిది నెలలు గడిచినా 36 వార్డుల్లో కనీస వసతుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు. వీధిదీపాలు, పారిశుద్ధ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. రికార్డుల్లో సిబ్బంది హాజరు ఉన్నట్లు చూపుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ పనులు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్లు, డిజిటల్ బిన్లు, డీజిల్ వినియోగానికి సంబంధించిన వివరాలను ఆర్‌టీఐ ద్వారా కోరినా అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని జావీద్ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి వార్డుల్లో వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలను సమీకరించి ఆందోళన చేపడతామని జావీద్ హెచ్చరించారు.


