బీసీల రాజ్యాధికారమే లక్ష్యం
– 2028లో ఓసీ నేతలను అసెంబ్లీ గేటు దాటనివ్వం
– అధికారంలోకి వస్తే బీసీలకు 2ఎకరాల భూ పంపిణీ
– ఉచిత విద్య, వైద్యం అందించేందుకు కృషి
– తాండూరులో బీసీ ఎమ్మెల్యే కావాలి
– టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
– బీసీ రాజ్యాధికార యాత్రకు స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో బీసీల రాజ్యాధికారమే లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.

శుక్రవారం తాండూరుకు టీఆర్పీ బీసీ రాజ్యాధికార యాత్ర చేరుకుంది. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో రోడ్‌షోలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లో తెలంగాణలో బీసీల జనాభా 2 కోట్లకు పైగా ఉన్నట్లు తేలిందని, ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో మాత్రం బీసీల జనాభాను 1 కోటి 80 లక్షలుగా చూపించారని అన్నారు. పదేళ్ల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది బీసీలను తగ్గించారని అన్నారు. అంతమంది చనిపోయి ఉంటే వారి డెత్ సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే కులగణన పత్రాలను కాల్చినట్లు చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుందన్నారు.

బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెడ్ల లెక్కలన్నీ తెలుస్తామని, బీనామీలు బొక్కలు తీస్తామన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న కోటి ఎకరాల భూమిని స్వాదీనం చేసుకుని బీసీ ప్రభుత్వంలో పేదలకు 2ఎకరాల చొప్పున భూములను అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో బీసీలపై జరిగే హింసను అరికట్టి భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. బీసీలకు జనాభాకు తగిన రాజ్యాధికారం, భూమి, నాణ్యమైన విద్య, వైద్యం అందాలన్న లక్ష్యంతోనే బీసీ రాజ్యాధికార యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అత్యధిక సంఖ్యలో బీసీల ఓట్లు ఉన్నప్పటికీ రాజకీయ అధికారం మాత్రం బీసీలకు దక్కడం లేదన్నారు. బీసీలు తమ ఓటు శక్తిని గుర్తించాలని, తమ ఓట్లతో తమ వర్గాల నాయకులను చట్టసభలకు పంపించాలని పిలుపునిచ్చారు.

బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని ప్రకటించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఆగమైపోతుందని ఆవేధన వ్యక్తం చేశారు. తాండూరులో డబుల్ బెడ్ రూంలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లో రోడ్లు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. కోకట్ బ్రిడ్జి కాలేదని, చిలుక వాగు మద్యలోనే ఉందన్నారు. తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్ ఆసుపత్రిగా మార్చి.. పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారని అన్నారు. తాండూరులోని ఆసుపత్రిపై కోడంగల్ ఆసుపత్రి పేరు ఎందుకు ఉందో అర్థం చేసుకోవాలన్నారు. అందుకే తాండూరులో బీసీ నాయకుడే ఎమ్మెల్యే కావాలని, ఇందుకు అందరు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


