బీసీ శ్మశాన వాటికకు మహర్దశ..!
– అభివృద్ధికి రూ.1–2 కోట్ల నిధుల సాధనకు కృషి
– రాజకీయాలకు అతీతంగా మోడల్‌గా తీర్చిదిద్దేందుకు దృష్టి
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా రెడ్డి
– బీసీ స్మశాన వాటికలో పరిశుభ్రత పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు సాయిపూర్ రోడ్డులోని పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న బీసీ శ్మశాన వాటికకు మహర్దశ తీసుకోవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా రెడ్డి అన్నారు.

సోమవారం శ్మశాన వాటికలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, నాయకులు మాట్లాడుతూ.. గతంలో శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఇతర కారణాలతో నిధుల మంజూరులో జాప్యం జరిగిందన్నారు. ఇకపై రాజకీయాలు, కులాలకు అతీతంగా అందరూ కలిసి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.

శ్మశాన వాటిక కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ఉపయోగపడే ప్రదేశంగా ఉందని పేర్కొన్నారు. ప్రహరీ, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులను మెరుగుపరిచి మోడల్ శ్మశాన వాటికగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

అక్కడి షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బీసీ విద్యార్థుల హాస్టల్, గదుల నిర్మాణం వంటి సామాజిక అవసరాలకు వినియోగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు నిధులు సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల్ల నరసింహులు, పట్లోల్ల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


