చీకట్లో గుప్త నిధుల వేట..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

చీకట్లో గుప్త నిధుల వేట..!
– అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు
– ఆరుగురని పట్టుకున్న పోలీసులు..?
– పరారీలో మరో ముగ్గురు..?!
– జేసీబీ, రెండు కార్లు స్వాధీనం
– యాలాల మండలంలో ఘటన
యాలాల, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం బండమీదిపల్లిలో అర్ధరాత్రి అనుమానాస్పదంగా తవ్వకాలు జరుపుతున్న ఘటన కలకలం రేపింది.

చీకట్లో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపడుతున్నారన్న సమాచారంతో యాలాల పోలీసులు రాత్రి సమయంలో అక్కడికి చేరుకుని దాడి చేశారు. పోలీసులను గమనించిన ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ఘటనాస్థలంలో ఉన్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకుని యాలాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తవ్వకాలకు ముందు అక్కడ పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం.

పట్టుబడిన వారిలో ఓ సర్పంచ్‌ భర్త, మాజీ సర్పంచ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ విషయం పోలీసుల అధికారిక ధ్రువీకరణకు రావాల్సి ఉంది. అసలు అక్కడ ఎందుకు తవ్వకాలు చేపట్టారు? ఎవరి సూచనలతో ఈ వ్యవహారం జరిగింది? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

బీసీ సీఎం ప్రకటనపై హర్షం..!