బీసీ సీఎం ప్రకటనపై హర్షం..!
– మహేష్ కుమార్ గౌడ్ మాటకు కట్టుబడి ఉండాలి
– బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని డిమాండ్
– ఇతర పార్టీలు కూడా తమ వైఖరి తెలపాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అవుతారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ చేసిన ప్రకటనపై తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

బీసీ సీఎం అంశంపై చేసిన ప్రకటనను ఆచరణలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు మహేష్‌కుమార్ గౌడ్ కృషి చేయాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ కోరారు. శంషాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మహేష్‌కుమార్ గౌడ్ చేసిన ప్రకటన బీసీల్లో కొత్త ఆశలు రేకెత్తించిందని రాజ్‌కుమార్ అన్నారు.

కాంగ్రెస్‌లోని అన్ని వర్గాల నాయకులు బీసీ సీఎం అంశానికి మద్దతుగా నిలవాలని కోరారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా కాంగ్రెస్ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా బీసీ ముఖ్యమంత్రి అంశంపై తమ వైఖరిని బహిరంగంగా వెల్లడించాలని రాజ్ కుమార్ కోరారు. మాటలకే పరిమితం కాకుండా బీసీలకు రాజకీయ అవకాశాల కల్పనలో అన్ని పార్టీలు తమ విధానాన్ని స్పష్టం చేయాలని అన్నారు.

రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం ఒక స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే సత్యనారాయణ, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా సంఘం ప్రతినిధులు మంజుల, నరసమ్మ, విజయలక్ష్మి, అనితతో పాటు వివిధ మండలాల నాయకులు, బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

