మార్మోగిన శ‌ర‌ణు ఘోష‌

తాండూరు వికారాబాద్

తాండూరులో మార్మోగిన శ‌ర‌ణు ఘోష‌
– వైభోగంగా మణికంఠుని మహాపడిపూజ
– తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, భక్తులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల మైదానం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. బుధవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుందరంగా ఏర్పాటు చేసిన వేధికపై అయ్యప్ప పడిపూజ మహోత్సవం కొనసాగింది. రాత్రి మహా పడిపూజ ప్రారంభమైంది. బ్రహ్మశ్రీ వేణుమాధవ్ శర్మ గురుస్వామి ముందుండి పూజను జరిపించారు. పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స‌తీమ‌ణి ఆర్తిరెడ్డితో క‌లిసి అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామ్రుతాలతో అభిషేకం చేశారు.

అనంతరం జరిగిన మెట్ల పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. పూజా కార్యక్రమంలో భాగంగా గురుస్వాములు పాడిన అయ్యప్ప గీతాలతో ద‌ద్ద‌రిల్లింది. ఈ పడిపూజకు అయ్యప్పస్వామి భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అనంతరం పైలెట్ రోహిత్ రెడ్డి అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదానం చేశారు.

మరోవైపు పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవంలో పైలెట్ రోహిత్ రెడ్డి తల్లి ప్రమోదిని రెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి, బాబాయ్ పి. శ్రీశైల్ రెడ్డి, కుటుంబ సభ్యులతో పాటు వ్యాపారులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాల అయ్యప్ప స్వాములు, మహిళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.