ఈ ఐదు రోజులు పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
– ముంచుకొస్తున్న మండుటెండలతో ప్రమాదం
– వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక
దర్శిని డెస్క్: ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఐదు రోజులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండ తీవ్రతతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇంటి పట్టునే ఉండాలని సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలని, పగటి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీడపట్టున ఉండాలని సూచిస్తున్నారు. ఎండవేళల్లో బయటకు వెళ్తే గొడుగులు వాడాలని సూచిస్తున్నారు. కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తను సమర్పించిన వారు

