వామ్మో ఏప్రిల్ 1 తారీఖూ..!
– సర్కారు కీలక నిర్ణయాలు అప్పటినుంచే అమలు
– ఆందోళన చెందుతున్న సామాన్యులు
దర్శిని డెస్క్: ఏప్రిల్ 1 అనగానే అందరికి పూల్స్ డే గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ తారీఖూను తలుచుకుంటే సామాన్యుడికి గుబులు మొదలవుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి నిరుపేదలపై ధరల పిడుగు పడబోతోంది మరీ. ఫస్ట్ నుంచే విద్యుత్ చార్జీల పెంపు, ఆర్టీసీ చార్జీల పెంపు, ఔషద(మందులు) ధరల పెంపు, గ్యాస్ ధరల్లో వ్యత్యాసాలు ఈ నెల నుంచే ప్రారంభమవుతున్నాయి. కరోనా నుంచి కోలుకుని జనమంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో వరుస బాదుడు సామాన్య జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బ్రతికేదెలా దేవుడా అంటూ ఆందోళన చెందుతున్నారు.
పెరగనున్న మందుల ధరలు
ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు కూడా పెరిగనున్నాయి. యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్, పెయిన్ కిల్లర్స్‌తో సహా 800 రకాల మందుల ధరలు 10.7 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ శుక్రవారం (మార్చి 26) ఈ విషయాన్ని వెల్లడించింది. ధరలు పెరగనున్న వాటిల్లో జ్వరానికి వాడే పారాసిటమాల్, యాంటీ బయాటిక్స్ సొప్రోఫ్లాక్సాసిన్, మెట్రోనిడాజోల్, చర్మ వ్యాధులకు, గుండె సంబంధిత సమస్యలకు, కరోనా చికిత్సకు, అనీమియా, బీపీ, తదితర వాటికి సంబంధించిన మందులు ఉన్నాయి. మందుల తయారీకి ఉపయోగించే ముడి రసాయనాల కోసం విదేశాలపై ఆధారపడటం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెబుతున్నారు.
ఆర్టీసీలో చార్జీల మోత
డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్నిరకాల బస్‌పాస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు (Charges) ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్ బస్ టికెట్ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్ (Ordinary Pass) చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్ పాస్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచుతూ ఆర్టీసీ అధికారులు వివరాలు వెల్లడించారు. ఎన్‌జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి ఆర్డినరీ పాస్ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్–ఆర్టీసీ కోంబో టికెట్ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది. ఇటీవలే సేఫ్టీ సెస్ పేరుతో టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్ చేయటంతో గరిష్టంగా టికెట్ ధర రూ.5 మేర పెరిగింది. గతంలో రౌండాఫ్ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది.
విద్యుత్ చార్జీల పెంపు
ఇప్పటికే నిత్యావసరాల ధరలు.. పెట్రోల్(Petrol), డీజిల్(Diesel), గ్యాస్ రేట్లు సామాన్యుడి జేబుకి చిల్లు పెడుతున్నాయి. ఇప్పుడు వాటికి కరెంట్ బిల్లులు(Power Bill) కూడా తోడయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. భారీ ద్రవ్యలోటుతో డిస్కంలు కొట్టుమిట్టాడుతుండటంతో తప్పడం లేదని స్పష్టం చేస్తోంది. పెరిగిన రేట్లు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి రానున్నాయి. సామాన్యులు 50 యూనిట్లలోపు కరెంట్ వాడితో ఇప్పటిదాకా అన్ని చార్జీలతో కలిపి 87 రూపాయల బిల్లు వచ్చేది. పెరిగిన రేట్లతో ఆ మొత్తం 132 రూపాయల 41 పైసల బిల్లు రానుంది. అంటే దాదాపు 40 రూపాయల బిల్లు అదనంగా వస్తుందన్నమాట. వంద యూనిట్లలోపు వాడే వాళ్లకి కూడా పిడుగు లాంటి వార్తే ఇది. 99 యూనిట్లు వాడే వాళ్లకి ఇప్పటిదాకా 286 రూపాయల బిల్లు వస్తే ఇప్పుడా మొత్తం 361కి చేరుకోనుంది. అంటే.. 75 రూపాయలు అదనంగా చెల్లించాలన్నమాట. 400 యూనిట్లపైన కరెంట్ వాడే వినియోగదారులకు తడిసి మోపెడు కానుంది. 3,500లు వచ్చే బిల్లుకి మరో రెండు వందల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
గ్యాస్ ధరల్లో మార్పులు
దేశంలో వంట గ్యాస్ ధరలు సామాన్యుడి ఇంట్లో మంటెత్తాయి. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో దేశీయ వంట గ్యాస్ ధర సిలిండర్ కు 50 రూపాయల చొప్పున పెరిగడంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు సర్వీస్ చార్జీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 1050 రూపాయలకు చేరింది. ఇకనుంచి గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని ప్రతినిధులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి ప్రతి నెలలో గ్యాస్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని వెల్లడిస్తున్నారు.

