టచ్ చేసి చూడండి..!
– కౌన్సిలర్లను కించపరుస్తారా
– చైర్ పర్సన్, ఆమె భర్త భేషరతుగా క్షమాణ చెప్పాలి
– ఆర్డీఓ, అధికారులను విమర్శించే అర్హత దానయ్యకు లేదు
– మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింలు, కౌన్సిలర్లు
– నలుగురు జోలికొస్తే తరమికొడతాం: ప్రతిపక్ష కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి: మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్, అధికారులు, కార్మికులను టచ్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి అంటూ తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆమె భర్త పరిమళ్ గుప్తను వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఘాటుగా హెచ్చరించారు. కౌన్సిలర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ కించపరచడం పద్ధతి కాదని.. ఆర్డీఓ, అధికారులు, కౌన్సిలర్లను విమర్శించిన చైర్ పర్సన్, ఆమె భర్త భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణోలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆమె భర్త పరిమళ్ గుప్త మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్, అధికారులు, కౌన్సిలర్లపై చేసిన విమర్శలను ఖండించారు. ముఖ్యంగా కౌన్సిలర్లపై అనుచిత వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైస్ చైర్ పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పరిమళ్ దారిన పోయే దానయ్య అని అన్నారు. ఆయనకేం హక్కు ఉందని అధికారులను, కార్మికులను బెదిరిస్తారని ప్రశ్నించారు. తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్, అధికారులు, కార్మికులను టచ్ చేసి చూడండి.. దాని ఫలితం ఎలా ఉంటుందో చూస్తారన్నారు. అదేవిధంగా పార్టీని అగౌరవ పరిచేలా, కించపరిచేలా ఎనాడు నడుచుకోలేదన్నారు. తన పదవి గురించి పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, దానయ్య ఎందుకు మాట్లాడాతారని ఘాటుగా విమర్శించారు. బీజేపీ కౌన్సిలర్ అంతారం లలిత మాట్లాడుతూ చైర్ పర్సన్ కౌన్సిలర్ల పట్ల అనుచితంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. రెండేళ్ల కాలాన్ని టైంపాస్ చేశారని, పనికిమాలిన పనులతో మున్సిపల్కు అప్రతిష్ట తీసుకవచ్చారన్నారు.
అవినీతి చిట్టా విప్పుతాం, నలుగురు జోలికొస్తే ఖబడ్డార్
మరోవైపు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ ఆసిఫ్, సోమ శేఖర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్‌లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ భర్తపై మండిపాటు వ్యక్తం చే శారు. రెండేళ్ల పాలనలో అవినీతి పాలనకే తెరలేపారని అన్నారు. మొదటి కౌన్సిల్ నుంచి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. దొంగ బిల్లులు, వసూళ్లపై అవినీతి చేశారన్నారు. గతంలో చిలుకవాగులో చేపట్టిన బిల్లులను వసూలు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఓ స్థలం విషయంలో కూడ కౌన్సిలర్ల పేరుతో డబ్బులు డిమాండ్ చేశారన్నారు. త్వరలోనే ఆయన అవినీతి చిట్టాను బటయకు విప్పుతామన్నారు. కుక్కలు అంటూ తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. మున్సిపల్ కార్మికుల విషయంలో బెధిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. వారి జోలికొస్తే మంత్రి కేటీఆర్, ఎంపీ, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆ నలుగురు జోలికొస్తే ఏవిధంగా ఉంటుందో చూపిస్తామని అన్నారు. మరోసారి నలుగురు జోలికి, అధికారులు, కార్మికుల జోలికొస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సందుల లతగౌడ్, మెహరాజ్ భేగం, అశ్విని గుండప్ప, మంకాల రాఘవేందర్, ముక్తార్ నాజ్, భీంసింగ్, బంటారం లావణ్య, పూజరజినీ కాంత్, బాలప్ప, కో-ఆప్షన్ సబ్యులు సారంగా విజయ్ కుమార్, వెంకట్రాంపవార్, నాయకులు ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

