ఇక నుంచి ఆ తప్పు చేయొద్దు
– మేయర్లు, చైర్మన్లకు కేటీఆర్ చురక
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు ఇక నుంచి ఆ తప్పు చేయొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సుతిమెత్తని చురకలంటించారు. శుక్రవారం హైదరాబాద్లోని వెంగళ్రావు నగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. చైర్మన్లకు, మేయర్లకు రెక్వెస్ట్ అంటూ మొదలెట్టి మన దేశంలో ఉన్న దురలవాటు ఏంటంటే.. అధికారుల మీద అరవడం, ఎగిరెగిరి పడటం, తిట్టడం అనేది కొనసాగుతోంది.. అదే గొప్ప.. అట్ల మాట్లాడితనే పనులు అవుతాయని కొందరు భ్రమ పడుతున్నారని అన్నారు. అలాంటి సంస్కృతిని మానుకోవాలని, ప్రోత్సహించొద్దన్నారు. మున్సిపల్ అధికారులపై అరిస్తే.. గొప్ప అనుకునే వారికే ఈ హెచ్చరిక అంటూ గుర్తుచేశారు. గతంలో చెప్పాను.. మళ్లీ చెప్తున్నాను. అర్ధవంతమైన చర్చలు జరగాలంటే మొదట కెమెరాలు సమావేశాల్లో పెట్టొద్దు. కెమెరాలను చూసి రెచ్చిపోయే ఒక బ్యాచ్ ఉంటది. కెమెరా కోసం, సాయంత్రం వార్తల్లో పడేందుకు ఎగబడి ఎగబడి మాట్లాడటం, నోటికొచ్చినట్లు మాట్లాడటం చేస్తున్నారు. ఈ దిక్కుమాలిన దందా అంతా బంద్ కావాలంటే.. కెమెరాలు బంద్ చేయాలి. ప్రెస్ మీట్ పెట్టి సమాచారం ఇస్తామని ప్రెస్ వారికి చెప్పాలి. సమావేశాల్లో జరిగిన చిన్న చిన్న తప్పులను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో.. అధికారులు నిర్వీర్యం అవుతారు.. ఇది మంచి పద్దతి కాదని కేటీఆర్ సూచించారు. మన వాళ్లను మనమే తిట్టుకుంటే, అవమానిస్తే.. అది ఎవర్నో అవమానించినట్లు కాదు.. మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టు.. మన ప్రభుత్వాన్ని అవమానించుకున్నట్టు తప్ప ఇంకోటి కానే కాదన్నారు. రాత్రికి రాత్రే అభివృద్ధి జరగడం అనేది సాధ్యం కాదు.. ఒక ఎజెండా ప్రకారం పని చేస్తామన్నారు. మన వాళ్ల మీద మనం అరవడం సరికాదు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా, ఎజెండా ప్రకారం, సజావుగా సాగాలని ఆయా మున్సిపాలిటీల్లోని మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సుతిమెత్తగా చురకలంటించారు.

