వైద్య రంగానికి సర్కారు పెద్దపీట
– జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు టిఆర్ఎస్ ఘనతే
– వచ్చే విద్యా సంవత్సరంలో వికారాబాద్ లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు
– జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు..
– పరిగిలో రూ. 2.40 కోట్లతో ఏఎన్ఎమ్ సబ్ సెంటర్
– తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ. హరీష్ రావు
– పరిగి లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం
వికారాబాద్, దర్శినిప్రతినిధి: తెలంగాణ సర్కారు వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు అన్నారు. గురువారం జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించారు. ఆస్పత్రిలో కావలసిన సదుపాయాలు తదితర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగుల తో మాట్లాడి వైద్యం విధానం ఎలా ఉందని తెలుసుకొని బాలింతలకు కెసిఆర్ కిట్టు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనలోనే వైద్య రంగం పురోగతిని సాధించిందన్నారు. గత 60, 70 ఏళ్ల కాంగ్రెస్, తేదేపా పాలనలో కేవలం మూడు మెడికల్ కళాశాలలే ఉంటే ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో 33 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా కు మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుంతుందన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఎంబిబిఎస్ అడ్మిషన్లు ప్రారంబిస్తామని చెప్పారు. అలాగే జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న వంద పడకల ఆసుపత్రిని 330 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే 50 పడకలతో ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైద్య శాఖలో ఉన్న అన్ని విభాగాల్లో 13 వేల పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని పరిగి, వికారాబాద్, కోడంగల్, తాండూరులో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే పరిగిలో మరో 20 రోజుల్లో డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పరిగిలో ఎమ్మెల్యే కోరిన మేరకు రూ. 2.40 కోట్లతో ఏఎన్ఎం సబ్ సెంటర్ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మూడు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పరిగి ఆసుపత్రిలో మార్చురీ గది నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణాలకు త్వరలో మంజూరు ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిగిలో డిజిటల్ ఎక్స్ రే మిషన్ ను కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలో కోటి రూపాయలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, జెడ్ పి టి సి హరిప్రియ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు ఆర్ ఆంజనేయులు, వైద్య విధాన పరిషత్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.



