రాజుగౌడ్ ప్యాకేజీ లీడర్..!
– పదవి కోసం పార్టీలో వర్గాల మద్య చిచ్చు
– నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలి
– చైర్ పర్సన్ పదవిపై అధిష్టాన నిర్ణయానికే కట్టుబాటు
– మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ వర్గం నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ తాండూరు అధికార ప్రతినిధి రాజుగౌడ్ ప్యాకేజీ నాయకుడే అని, ఇరువర్గాల మద్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గం నేతలు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్ అబ్దుల్ రజాక్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, నాయకులు పరిమళ్ గుప్త, సాయిపూర్ బాల్ రెడ్డి తదితరులు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు, నేతలపై చేసిన విమర్శలను ఖండించారు. గతంలో టీడీపీలో ఉన్న రాజుగౌడ్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ద్వారా ప్యాకేజీ తీసుకుని టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆరోపించారు. ఇప్పుడే అదే ప్యాకేజీల కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ వర్గంలో ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీలో ఏ టీం, బీ టీం అంటూ పార్టీలో చీలికలు తెచ్చారని అన్నారు. పార్టీలో పోస్టు కోసం ఎమ్మెల్యే పంచన చేరి ప్యాకేజీ కింద ఎమ్మెల్సీ వర్గం నేతలే విమర్శిస్తున్నారని అన్నారు. రెచ్చగొట్టే విమర్శలు చేస్తూ పార్టీలో చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చీలలో, మసీదులలో ప్రమాణంచేద్దాం రండీ అంటూ సవాల్ చేసిన రాజుగౌడ్ కు నీతి నిజాయితీ ఉంటే కోస్గి దర్గాలో ప్రమాణం చేసేందుకు రావాలంటూ వ్యతిరేక సవాల్ విసిరారు. 10 మంది కౌన్సిలర్ల బీఫారాం విషయాలపై మాట్లాడిన రాజుగౌడ్ ఎన్నికల సమయంలో 20 బీపారాలు తెచ్చుకుందామని ఎమ్మెల్సీని రెచ్చగొట్టింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. రాజుగౌడ్ రాజకీయాలను ప్రజలందరు గమనిస్తున్నారని, నీతిమాలిన రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని అన్నారు. చైర్ పర్సన్ పదవిలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, అధిష్టానం ఆదేశిస్తే దీపా నర్సింలును చైర్ పర్సన్ గా అంగీకరించి మద్దతు అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ముత్యాల గల్లిలో ఎమ్మెల్యే వర్గీయులే రాజకీయాలు చేశారని, అందరు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారని సంఘం నాయకుని ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, బోయరవి, వెంకన్న గౌడ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవిచ నాయకులు బంటు మల్లప్ప, బోయరాజు, యువనాయకులు బిర్కడ్ రఘు, బీదర్ రాజశేఖర్, అశోక్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



