గులాబీ గెలుపు గుర్రం నేనే..!
– తాండూరు అసెంబ్లీ స్థానం నుంచే పోటే
– మున్సిపల్ ఒప్పంద రాద్దాంతాలకు త్వరలోనే చెక్
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లను ఇవ్వబోతుందని, ఆ గెలుపు గుర్రాల జాబితాలో నేను కూడ ఖచ్చితంగా ఉన్నా అని అనుకుంటున్నానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 16న వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పర్యటన ఉండడంతో శనివారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నూతన కలెక్టర్ భవనం, సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడీయా సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని, అందరితో కలిసి సాగుతున్నామని కొట్టిపారేశారు. తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేలలో ఎలాంటి విభేధాలు లేవన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్టు ఇస్తుందని గతంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ లెక్కనే తాండూరు టిక్కెట్లు తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలు పట్టించుకోమన్నారు. సర్వేలో ఉన్న వాళ్లకే టిక్కెట్టు ఇస్తుందని, పార్టీ తనకు అవకాశం ఉంటే తప్పక పోటీ చేస్తామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఒప్పందాలు రాష్ట్రంలో చాలా మున్సిపాల్టీలో ఇవే ఒప్పందాలు జరిగాయని గుర్తుచేశారు. త్వరలోనే వివాదానికి చెక్ పడుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఈనెల 16న వికారాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసి పర్యటనను జయప్రదం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్, శంకర్, నందు, రమేష్, రామచంద్ర రెడ్డి, ముక్తార్, షరీఫ్, హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


:

