చిలుకవాగుకు గ్రీన్ సిగ్నల్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చిలుకవాగుకు గ్రీన్ సిగ్నల్..!
– రూ. 30 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
– ఫలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని చిలుక వాగు డ్రైనేజీ పనుల పూర్తికి గ్రీన్ సిగ్నల్ పడింది. చిలుక వాగు డ్రైనేజీ పూర్తి చేసేందుకు రూ. 30 కోట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన విభాగం జీవోను విడుదల చేసింది. తాండూరులోని చిలుక వాగును రూ. 16 కోట్లతో చేపట్టారు. డ్రైనేజీ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. అయితే డ్రైనేజీ మార్గంను ఇంకా ముందుకు కొనసాగించాలని స్థానికుల నుంచి అభిప్రాయాల వ్యక్తమయ్యాయి.

డ్రైనేజీ పనులను సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. రూ. 30 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కలిసి చిలుక వాగు కోసం పంపించిన రూ. 30 కోట్ల ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించింది.

తాజాగా మున్సిపల్ పరిపాలన విభాగం నగరాభివృద్ధి ఖాతా నుంచి నిధులు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో చిలుక వాగు డ్రైనేజీ సంపూర్ణంగా చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ పడింది. మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో చిలుక వాగుకు నిధులు మంజూరు కావడం పట్ల పార్టీ నేతలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

కేంద్రం కుట్రలు సాగనివ్వం..!