లక్షమందితో సీఎం కేసీఆర్ సభ
– అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ
– గెలుపు గుర్రం జాబితాలో నేనూ కూడ ఉన్నా
– చైర్ పర్సన్ల విషయంలో ఎమ్మెల్యేల జోక్యం అనవరసం
– ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 16న వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు భారీగా జన సమీకరణ చేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16న వికారాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ హాజరై జిల్లా కలెక్టర్ సమీకృత భవన ప్రారంభం, నూతనంగా మంజూరైన మెడికల కళాశాలకు శంకుస్థాపన, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సం చేస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలోని చేవేళ్ల, వికారాబాద్, పరిగి, కోడంగల్, తాండూరు, కోట్ పల్లి నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 25 వేల మంది తగ్గకుండా జనాలను తరలించేందుకు ఆయా నియోజకవర్గాలలోని మండలాల ముఖ్య నాయకులకు ఆదేశించడం జరిగిందని అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే సభలో తాండూరు నియోజకవర్గానికి సంబంధించి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. రింగురోడ్డు నిధులు, పరిహారం పెండింగ్లో ఉన్నాయని, రానున్న రోజుల్లో తాండూరు మెడికల్ కళాశాల మంజూరు చేయాలని మరోసారి విన్నవిస్తానని, కుదరకుంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతానని చెప్పారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు తాండూరు ప్రాంతంలోని నాపరాతిపై రాయల్టీ తగ్గించాలని కోరుతునానని చెప్పారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తున్నారని, ఆ గెలుపు గుర్రాల జాబితాలో తానుకూడ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా తాండూరు నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని దాదాపు 20 మున్సిపాల్టీలలో టీఆర్ఎస్ పార్టీ మద్యనే మున్సిపల్ చైర్ పర్సన్ల పదవి ఒప్పందాలు జరిగాయని, వాటిని అమలు చేయడంలో ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకునే అవసరం ఉండదన్నారు. తాండూరులో చైర్ పర్సన్ అభివృద్ధి చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని, ఈ మేరకు ఆమె కుర్చి దిగనని అంటున్నారని తెలిపారు. ఈ విషయంలో తమ ప్రమేయం ఉండదని, మున్సిపాల్టీలకు వారే బాసులుగా ఉంటారని, కమీషనర్లు కూడ వారి ఆదేశాలను పాటించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రామ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ద్యావారి విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్ బోయ రవిరాజు, సీనియర్ నాయకులు గడ్డలి రవీందర్, కోఆప్షన్ సభ్యుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు శంషోద్దీన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



