కొత్త పంచాయ‌తీల‌కు మ‌హ‌ర్ద‌శ‌

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

కొత్త పంచాయ‌తీల‌కు మ‌హ‌ర్ద‌శ‌
– త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల నిర్మాణం
– రోడ్డు, డ్రైనేజీల ఏర్పాటుకు ప్రాధాన్యం
– ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్న ప్ర‌భుత్వం
ద‌ర్శిని డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్పాటైన గిరిజన తాండాల‌కు మ‌హ‌ర్ద‌శ‌ ప‌ట్ట‌బోతుంది. కొత్త పంచాయ‌తీల‌కు ప‌క్కా భ‌వ‌నాలు, రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు దృష్టి సారిస్తోంది. 2018లో తెలంగాణ ప్ర‌భుత్వం 500 జ‌నాభా క‌లిగిన తాండాలు, గ్రామాల‌ను కొత్త పంచాయ‌తీలుగా ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి కొత్త పంచాయ‌తీల‌కు సొంత భ‌వ‌నాలు లేక ఇబ్బందులు ఎదర‌వుతున్నాయి. దీంతో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం చొర‌వ చూపుతుంది. ఇందులో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఇంద్రకర్‌రెడ్డి, మ‌ల్లారెడ్డిలు కృషి చేస్తున్నారు. తాజాగా సీఎం ఆదేశాల మేర‌కు ఆర్థిక శాఖ‌, పంచాయ‌తీ రాజ్ శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. కొత్త గ్రామ పంచాయ‌తీల భ‌వ‌నాలు, మౌలిక స‌దుపాయాల కోసం సీఎం కేసీఆర్‌ బ‌డ్జెట్‌లో వెయ్యి కోట్లు ప్ర‌వేశ పెట్టారు. దీంతో రాష్ట్రంలోని 2400 కొత్త గ్రామ పంచాయ‌తీల్లో భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ.300 కోట్లు, పంచాయ‌తీరాజ్‌, రూ.300 కోట్లు గిరిజ‌న సంక్షేమ నిధులు ఇవ‌న్నీ క‌లిపి త్వరలోనే గిరిజ‌న‌, ఆదివాసీ గూడాల్లో తండాల్లో గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ ప‌నులు చేప‌డ‌తామ‌ని మంత్రులు వివ‌రించారు. అయితే, ఈ నిధులు వినియోగంపై ఎస్టీ శాస‌న స‌భ్యుల‌తో ఒక స‌మావేశం నిర్వహిస్తామన్నారు. అలాగే ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావుతో ఒక భేటీ ఉంటుంద‌ని మంత్రులు తెలిపారు. ఈ లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు మంత్రులు వివ‌రించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తుంద‌ని తెలిపారు.