దేవి నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలపై నిఘా
– మండపాలు, ఊరేగింపులకు డీజే నిషేధం
– భక్తిశ్రద్దలతో ప్రశాంతంగా జరుపుకోవాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: దేవి నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలపై జిల్లాలో నిఘా ఉంచడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఓ ప్రకటనలో మాట్లాడుతూ ప్రజలకు దేవి నవరాత్రి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ నుంచి పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని దేవి నవరాత్రి మండపాలను రాత్రి సమయాలలో గస్తీ నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని, అన్ని ప్రదేశాలలో పెట్రోలింగ్ చేస్తూ ఎటువంటి సంఘటనలకు తావు ఇవ్వకుండా ప్రశాంతముగా నిర్వహించుకునేలా దృష్టిసారించడం జరిగిందన్నారు. అమ్మవార్ల మండపాల వద్ద, ఊరేగింపులలో శాంతిభద్రతలు, ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని డిజే సౌండ్కు నిషేధం విధించడం జరిగిందని, ఎలాంటి అనుమతులు ఇవ్వడం జరగదన్నారు. దేవి నవరాత్రులు, బతుకమ్మ సంబరాలను భక్తిశ్రద్దలతో.. ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ ఉత్సవాలలో శాంతి భద్రతల రక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


