తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉచిత రేష‌న్

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉచిత రేష‌న్
– ఒక్కొక్క‌రికి ఐదు కాకుండ ప‌ది కిలోలు 
– ప్రక‌టించిన కేసీఆర్ స‌ర్కారు
– డిసెంబ‌ర్ నెల వ‌ర‌కు పంపిణీ
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉచితంగా రేష‌న్ బియ్యం పంపిణీ చేయాల‌ని కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ఈఏడాది డిసెంబర్ వరకు పొడిగించింది. దీంతో ప్రతి నెలా ఒక్కో వ్యక్తికి ఇచ్చే ఐదు కిలోల బియ్యానికి అదనంగా మరో ఐదు కిలోలు కలిపి ఒక్కో వ్యక్తికి పది కిలోల బియ్యాన్ని డిసెంబర్ వరకు పంపిణీ చేయనున్నారు. అయితే కేంద్రప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం కేవలం సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించిన కార్డులకు మాత్రమే ఇవ్వనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం కిలో రూపాయి చొప్పున పంపిణీ చేసేవారు. తాజాగా రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులందరికీ పది కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విష‌యాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్ ఓ ప్రకటనలో స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో రేషన్ కార్డుదారులందరికీ డిసెంబర్ వరకు 10 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ నెలకు సంబంధించి అక్టోబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.227.25 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 90 లక్షల కార్డులకు, 2.84 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాలతో గురువారం నుండి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామన్నారు.