పైలెట్‌కు సెక్యూరిటీ పెంపు..!

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

పైలెట్‌కు సెక్యూరిటీ పెంపు..!
– 4 అంచెలకు భద్రతను పెంచిన సర్కారు
– ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : కారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా నిలిచిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి ప్రభుత్వం సెక్యూరిటీని పెంచింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్ ఫాంహౌస్‌పై దాడులు చేసిన పోలీసులు.. నిందితులను రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. తాండూర్‌ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ సంఖ్యను 4+4కి పెంచింది. దీంతోపాటు ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు ఫాంహౌస్ వ్యవహారంలో రోహిత్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించిన చర్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతున్నాయి. ఆపరేషన్‌లో కుర్తాలో వాయిస్ రికార్డులు, కొబ్బరి నీళ్లు తీసుకురండి అనే కోడ్ విషయాలపై సర్వత్ర చర్చకు దారితీసింది.