బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– జుంటుపల్లిలో కుటుంబ సభ్యులకు పరామర్శ
యాలాల, దర్శిని ప్రతినిధి: ఇటీవల శ్రీశైలంలో దైవ దర్శనానికి వెళుతూ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి భీమయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళుతుండగా నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగగా ఆటో డ్రైవర్‌తో పాటు ఉప్పరి భీమయ్య కుటుంబానికి చెందిన మాణెమ్మ, కవితలు మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జుంటుపల్లి గ్రామాన్ని సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందజేసేలా దృష్టిసారిస్తామన్నారు. ఎమ్మెల్సీ వెంట పీఏసీఎస్ చైర్మెన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీటిసి సిద్రాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శివ, భూపాల్, నాయకులు తదితరులు ఉన్నారు.


