మునుగోడు బైపోల్‌లో కారు జోరు..!
– విన్నర్‌గా నిలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
– రాజగోపాల్ రెడ్డిపై 11వేల మెజార్టీ విజయం
– సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: మునుగోడు గడ్డపై జరిగిన బైపోలింగ్‌లో టీఆర్ఎస్ కారు జోరు సాగింది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రధాన బీజేపీ ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్ల కౌంటింగ్ పూర్తైన తర్వాత టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11,666 వేల ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. దీంతో బీజేపీ రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వకుండా గతంలో ఉన్న సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఆదివారం ఉదయం నుంచి 15 రౌండ్ల కౌంటింగ్ లో ప్రతి రౌండ్ ఉత్కంఠభరితంగా సాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ కంటే నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి.. ఈవీఏంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత మొదటి రౌండ్లో 1200కు పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. తరువాత రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి స్వల్ప అధిక్యాన్ని కనబర్చారు. అయినప్పటికి మూడు రౌండ్లు ముగిసిన తరువాత కూడా టీఆర్ ఎస్ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబర్చారు. నాలుగో రౌండ్ నుంచి 15 రౌండ్ల వరకు ప్రతి రౌండ్ లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబర్చారు. 2,3 రౌండ్లు మినహిస్తే మిగిలని అన్ని రౌండ్లలో టీఆర్ ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. చౌటుప్పల్, చండూరు అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి మెజార్టీ వస్తుందని ఆ పార్టీ ఆశించింది. అయితే మునుగోడు ఉప ఎన్నికలో పట్టణ ఓటర్లు కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మొదటి నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత.. తాము ఆశించిన విధంగా చౌటుప్పల్ మండలంలో మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందడంతో నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులతో సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని పార్టీ కార్యాలయాల వద్ద సందడి చేశారు. బాణా సంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

