చీపురు పట్టిన కౌన్సిలర్
– బస్తీ దవాఖానలో శ్రమదానం
– అభినందించిన స్థానికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆమె ఒక ప్రజా ప్రతినిధురాలు. అంతకుముందే బీఏ, బీఈడీ, ఏంఎ చదివిన విద్యావంతురాలు కూడ. ప్రజా సేవ కోసం ఎన్నికల్లో నిలిచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. కౌన్సిలర్ హోదాను మరిచి చీపురు చేపట్టారు. బస్తీ దవాఖాన పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతో స్థానికులు సూపర్ కౌన్సిలర్ అంటూ అభినందించారు. ఆమె ఎవరో కాదు తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని 14వ వార్డు కౌన్సిలర్ బొంబీనా. ఇంతకు ఆమె చీపురు ఎందుకు పట్టాల్సి వచ్చిందంటే.. పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా సమ్మె చేపడుతున్నారు. దీంతో వార్డులో పారిశుద్ధ్య పనులలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే వార్డులోని అంబేద్కర్ పార్కులో బస్తీ దవఖాన కూడ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా బస్తీ దవఖాన ఆవరణ పూర్తిగా చెత్త చెదారంతో నిండుకుపోయింది. సోమవారం దవఖాన ప్రాంగణానికి వచ్చిన కౌన్సిలర్ బొంబీనా చెత్తను చూసి చీపురు చేత పట్టుకున్నారు. దవఖాన ప్రాంగణం మొత్తం చీపురుతో స్వయంగా ఊడ్చేశారు. గమనించిన స్థానికులు కౌన్సిలర్ బొంబీనాను అభినందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బొంబీనా మాట్లాడుతూ ప్రజా ప్రతినిధురాలుగా అవసరమైన సమయంలో ఇలాంటి సేవ కార్యక్రమాలు చేపట్టడం కూడ ఒక బాధ్యతే అని పేర్కొన్నారు.

