తప్పుడు ఎజెండాపై జయం మాదే..!
– యాక్టుకు విరుద్దమని ఏకిపారేత
– సంతకం లేకుంటే చెల్లదని విచారణలో వ్యక్తం
– అధికారులపై న్యాయస్థానం చర్యలకు అవకాశం
– మీడియా ముందు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: చైర్ పర్సన్ హక్కులను కాలరాస్తూ అధికారులు రూపొందించిన తప్పుడు ఎజెండాపై జయం మాదే అవుతుందని.. న్యాయం మావైపే ఉందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఈ యేడాది జనవరి 18న ప్రవేశ పెట్టిన ఎజెండాపై తన సంతకం లేకుండా ఆమోదం చేసుకున్నారని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నో వాయిదాల తరువాత అంశాన్ని ఈనెల 29న ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద తేల్చుకోవాలని హైకోర్టులు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ విచారణలో జరిగిన అంశాలను బుధవారం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. సీడీఎంఏ కార్యాలయంలో జరిగిన విచారణలో అధికారుల తీరును తప్పు పట్టారని చైర్ పర్సన్ చెప్పుకొచ్చారు. యాక్టుకు విరుద్దంగా తప్పుడు ఎజెండాను ప్రవేశ పెట్టారని, చైర్ పర్సన్ సంతకం లేకుండా ఎలా ప్రవేశ పెట్టారని ప్రశ్నించారని తెలిపారు. ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా చైర్ పర్సన్ కీలకమని, ఆమె సంతకం లేని ఎజెండా రూపొందించే అధికారం కమీషనర్‌కు ఉండదని స్పష్టం చేసిందన్నారు. కమీషనర్ సంతకం లేకపోయినా చైర్ పర్సన్ సంతకం ఖచ్చితంగా ఉండాలని చెప్పినట్లు తెలిపారు. ఇష్ట రాజ్యంగా రూపొందించే అధికారం కమీషనర్‌కు లేదని.. సెక్షన్లతో సహా అధికారుల తీరును ఏకిపారేశారని వివరించారు. మొత్తానికి సంతకం లేని ఎజెండా తప్పుడు ఎజెండా అవుతుందని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఇరువర్గాల వాదనల తరువాత తప్పుడు ఇలాంటి కేసుల్లో ఎజెండా ముందు.. వెనుక పేజీలలో సంతకం తప్పకుండా ఉండాలని సూచించిందని తెలిపారు. మొత్తానికి అధికారులు రూపొందించిన తప్పుడు ఎజెండాపై మాదే జయం అవుతుందని.. న్యాయం తప్పక జరుగుతుందని ఆశీస్తున్నట్లు విజయాభావం వ్యక్తం చేశారు. తప్పుడు ఎజెండా రూపకల్పనపై అధికారులపై న్యాయం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, బోయరవి తదితరులున్నారు.

